హిరేన్‌ మృతికి కారణాలేమిటి?

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటికి సమీపంలో ఇటీవల కనుగొన్న పేలుడు పదార్థాల వాహనం యజమానిగా

Published : 07 Mar 2021 14:53 IST

అటాప్సీ నివేదిక రావాలంటున్న పోలీసులు 
అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాల వాహనం కేసు

ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటికి సమీపంలో ఇటీవల కనుగొన్న పేలుడు పదార్థాల వాహనం యజమానిగా భావిస్తున్న హిరేన్‌ మన్‌సుఖ్‌ మృతికి కారణాలు తెలియరాలేదు. ప్రతిపక్షాలు దీన్ని హత్యగా ఆరోపిస్తుండగా.. పోలీసులు మాత్రం మన్‌సుఖ్‌ నీట మునిగి చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఆయన మృతికి కారణాలు తెలియాలంటే అటాప్సీ నివేదిక అందాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈమేరకు మన్‌సుఖ్‌ కడుపులోని అవయవాలను ముంబయిలోని ఓ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించినట్లు ఠాణే పోలీసు అధికారి ఒకరు శనివారం తెలిపారు. దక్షిణ ముంబయిలోని అంబానీ నివాసానికి సమీపంలో ఇటీవల జిలెటిన్‌ స్టిక్స్‌తో ఓ వాహనాన్ని (ఎస్‌యూవీ) పోలీసులు కనుగొన్న సంగతి తెలిసిందే. అనంతరం ఆ వాహనం తనదేనని, అంతకు వారం రోజుల క్రితం అది చోరీకి గురైందని మన్‌సుఖ్‌ పోలీసులకు తెలిపారు. ఈక్రమంలో గురువారం అదృశ్యమైన ఆయన శుక్రవారం సముద్రపు పాయలో శవమై కనిపించారు. నౌపడాలోని హిరేన్‌ మన్‌సుఖ్‌ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆ కుటుంబ సభ్యులకు పోస్ట్‌మార్టమ్‌ నివేదికను అందజేశారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్‌) దర్యాప్తు ప్రారంభించింది. హిరేన్‌ మృతదేహాన్ని కనుగొన్న ప్రాంతాన్ని పరిశీలించింది.

అధికార, ప్రతిపక్షాల వాగ్యుద్ధం..

హిరేన్‌ అనుమానాస్పద మృతిపై శివసేన నేతృత్వంలోని అధికార మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ), ప్రతిపక్ష భాజపాల మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోంది. హిరేన్‌ హత్యకు గురైనట్లు తెలుస్తోందని మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ శనివారం అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల దర్యాప్తు తీరును ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి అప్పగించాలని భాజపా సీనియర్‌ నేత దేవేంద్ర ఫడణవిస్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ కేసులో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా పేరుపడిన ఓ అధికారి పాత్రపై కూడా ఆయన అసెంబ్లీలో సందేహాలు లేవనెత్తారు. కాగా కీలక సాక్షి మృతిచెందడంపై ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టవద్దని, నిజాన్ని తేల్చడం సంకీర్ణ ప్రభుత్వ ప్రతిష్ఠకు ముఖ్యమని శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌ స్పష్టం చేశారు. వీలయినంత త్వరలో హోంశాఖ వాస్తవాలను బయట పెడుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని