
రిహానా.. గ్రెటా ఎవరో తెలియదు కానీ..
అంతర్జాతీయ సెలబ్రిటీల మద్దతుపై టికాయిత్ స్పందన
ఘజియాబాద్: రైతుల ఉద్యమానికి అంతర్జాతీయ ప్రముఖులు మద్దతు ఇవ్వడాన్ని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ స్వాగతించారు. అయితే ఆ సెలబ్రిటీల గురించి తనకు పెద్దగా తెలియదని పేర్కొన్నారు.
దేశ రాజధాని సరిహద్దుల్లో గత రెండు నెలలకు పైగా నిరసన సాగిస్తున్న రైతులకు ప్రముఖ పాప్ స్టార్ రిహానా, పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ తదితరులు మద్దతు పలకడం వివాదానికి తెరలేపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై దిల్లీ - ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని గాజీపుర్ వద్ద ఆందోళనలో పాల్గొన్న రాకేశ్ టికాయిత్‌ను మీడియా ప్రశ్నించగా.. ‘ఎవరా విదేశీ ప్రముఖులు?’ అని అడిగారు. రిహానా, గ్రెటా పేర్లు చెప్పగా.. ‘నాకు వారి గురించి తెలియదు. అయితే మా ఉద్యమానికి వారు మద్దతు పలకడం వల్ల వచ్చిన సమస్య ఏంటీ?’ అని ఆయన ప్రశ్నించారు.
ఆది నుంచి రైతుల ఆందోళనలో పాల్గొన్న రాకేశ్ టికాయిత్.. గణతంత్ర దినోత్సవం తర్వాత నుంచి ఉద్యమానికి కీలకంగా మారారు. జనవరి 26 ఘటనల తర్వాత దిల్లీ సరిహద్దుల్లో నుంచి రైతులను ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నించగా.. టికాయిత్ అడ్డునిలిచారు. మరింత మంది రైతులు సరిహద్దులకు రావాలని పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు వేలాది మంది రైతులు గాజీపుర్‌కు చేరుకున్నారు. వారితో పాటు టికాయిత్ కూడా అక్కడే నిరసన దీక్ష సాగిస్తున్నారు.
ఇవీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.