WhatsApp: కొత్త ఐటీ నిబంధనలపై హైకోర్టుకు

సామాజిక మాధ్యమాల్లో డిజిటల్‌ కంటెంట్‌పై నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం బుధవారం నుంచి అమల్లోకి తెచ్చిన కొత్త ఐటీ నియమ నిబంధనలపై ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌

Published : 26 May 2021 10:26 IST

దిల్లీ: సామాజిక మాధ్యమాల్లో డిజిటల్‌ కంటెంట్‌పై నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం బుధవారం నుంచి అమల్లోకి తెచ్చిన కొత్త ఐటీ నియమ నిబంధనలపై ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ దిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ నిబంధనలను తక్షణమే నిలిపివేయాలని కోరిన వాట్సాప్‌.. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానంలో ఫిర్యాదు చేసినట్లు రాయిటర్స్‌ కథనం పేర్కొంది. కొత్త నిబంధనలు యూజర్ల వ్యక్తిగత గోపత్యకు భంగం కలిగించేలా ఉన్నాయని వాట్సాప్‌ ఆరోపిస్తున్నట్లు తెలిపింది.

కొత్త నిబంధనల ప్రకారం.. దేశ సార్వభౌమత్వానికి, రక్షణకు సంబంధించిన కీలకాంశాలకు సంబంధించిన ఐదైనా సమాచారాన్ని లేదా ప్రజల భద్రతకు హాని కలిగించేలా తప్పుడు పోస్టులు పెడితే.. వాటి మూలాలను సదరు సోషల్‌మీడియా సంస్థలు ప్రభుత్వానికి వెల్లడించాల్సి ఉంటుంది. అయితే భారత రాజ్యాంగం ప్రకారం.. ఇది వ్యక్తుల గోప్యత హక్కులను ఉల్లంఘించినట్లేనని వాట్సాప్‌ ఆరోపిస్తున్నట్లు సమాచారం. వాట్సాప్‌లో ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ సందేశాలు ఉంటాయని, ఒకవేళ కొత్త ఐటీ నిబంధనలను అనుసరిస్తే ఆ ఎన్‌క్రిప్షన్‌ను పక్కన పెట్టాల్సి వస్తోందనేది వాట్సాప్‌ వాదన. అందువల్ల ఈ నిబంధనలను వెంటనే నిలిపివేయాలని కోరుతూ సదరు మెసేజింగ్‌ యాప్‌ దిల్లీ హైకోర్టులో ఫిర్యాదు దాఖలు చేసిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న పేరు చెప్పడానికి ఇష్టపడని వ్యక్తులు చెప్పినట్లు రాయిటర్స్‌ పేర్కొంది. అయితే ఈ ఫిర్యాదును వాట్సాప్‌ స్వయంగా దాఖలు చేసిందా.. దీనిపై కోర్టు ఎప్పుడు విచారణ జరపనుందన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉండగా.. కొత్త నిబంధనల అమలుకు చర్యలు చేపడతామని వాట్సాప్‌ మాతృ సంస్థ ఫేస్‌బుక్‌ చెప్పడం గమనార్హం.

 నిజానికి డిజిటల్‌ కంటెంట్‌పై నియంత్రణకు కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. అయితే ఫేస్‌బుక్‌, ట్విటర్‌, వాట్సాప్‌ లాంటి దిగ్గజ సోషల్‌ మీడియా సంస్థలకు మాత్రం వీటి అమలుకు వీలుగా 3 నెలల గడువు కల్పించింది. అది మంగళవారంతో ముగిసింది. అంటే.. బుధవారం నుంచి కొత్త నియమ నిబంధనలు అమల్లోకి వచ్చినట్లన్నమాట. ఈ రూల్స్‌కు సామాజిక మాధ్యమ వేదికలన్నీ కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. లేదంటే ఇన్నాళ్లూ వాటికి రక్షణగా నిలుస్తున్న మధ్యవర్తి హోదా రద్దవుతుంది. అప్పుడు ఆయా సంస్థలు క్రిమినల్‌ కేసులు, ఇతర చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని