whatsapp ఉపాయాలు పన్నుతోంది: కేంద్రం

నూతన గోప్యతా విధానంతో ముసిరిన వివాదం సామాజిక మాధ్యమ సంస్థ వాట్సాప్‌ను ఇప్పట్లో వీడేట్లు కనిపించడం లేదు.

Updated : 03 Jun 2021 17:20 IST

దిల్లీ: నూతన గోప్యతా విధానంతో ముసిరిన వివాదం సామాజిక మాధ్యమ సంస్థ వాట్సాప్‌ను ఇప్పట్లో వీడేటట్లు కనిపించడం లేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం, వాట్సాప్ పోటాపోటీగా దిల్లీ హైకోర్టులో అభియోగాలు మోపుకుంటున్నాయి. వినియోగదారులతో ఈ విధానాన్ని ఆమోదింపజేసేందుకు వాట్సాప్ ఉపాయాలు పన్నుతోందని తాజా ఆఫిడవిట్‌లో కేంద్రం వాదించింది. 

నూతన గోప్యతా విధానాన్ని ఆమోదింపజేసేందుకు వాట్సాప్ వినియోగదారుల వ్యతిరేక పద్ధతులను వాడుతోందని గురువారం కేంద్రం దిల్లీ హైకోర్టులో ఆరోపించింది. అందుకోసం తన డిజిటల్‌ నైపుణ్యాన్ని ఉపయోగిస్తోందని తాజాగా సమర్పించిన అఫిడవిట్‌లో వెల్లడించింది. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు ఇంకా చట్టరూపం దాల్చకముందే వాట్సాప్‌ నూతన విధానం విషయంలో ముందుకు వెళ్తోందని వాదించింది. అలాగే నోటిఫికేషన్లు ఇస్తున్న తీరు కూడా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఉందని గుర్తుచేసింది. నోటిషికేషన్లతో వినియోగదారులపై దాడి చేస్తోందని దానిలో పేర్కొంది. వెంటనే ఆ పుష్‌ నోటిఫికేషన్లు పంపడాన్ని ఆపేలా చూడాలని కోర్టును కోరింది. 

వివాదాస్పదంగా మారిన గోప్యతా విధానానికి వ్యతిరేకంగా వాట్సాప్‌పై కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా, ఆ సంస్థ మాత్రం తాము చెప్పిన గడువు(మే 15) ప్రకారమే ఈ విధానం అమల్లోకి వచ్చిందని చెప్పింది. అయితే దాన్ని ఆమోదించని వినియోగదారుల ఖాతాలను తొలగించడం లేదని మాత్రం తెలిపింది. మరోవైపు, ఈ విధానం ఐటీ నిబంధనలు-2011కు అనుగుణంగా లేవని గతంలో కేంద్రం వెల్లడించింది.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని