Ajit Pawar: ఎన్సీపీ లక్ష్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యాఖ్యలు.. అజిత్‌ పవార్‌ ఏమన్నారంటే..!

మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చి.. అజిత్‌ పవార్‌ను చేర్చుకోవడం తప్పిదమేనంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ‘ఆర్గనైజర్‌’లో ఇటీవల ఓ వ్యాసం ప్రచురితమైంది. అయితే.. ఈ వ్యవహారంపై తాను మాట్లాడదల్చుకోలేదని అజిత్‌ పవార్‌ స్పష్టం చేశారు.

Published : 14 Jun 2024 19:30 IST

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra)లో భాజపా, శివసేనలకు అసెంబ్లీలో బలం ఉన్నా.. ఎన్సీపీని చీల్చి, అజిత్‌ పవార్‌ (Ajit Pawar)ను చేర్చుకోవడం తప్పిదమేనంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ‘ఆర్గనైజర్‌’లో ఓ వ్యాసం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై ఎదురైన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ స్పందిస్తూ.. ఈ వ్యవహారంపై తాను మాట్లాడదల్చుకోలేదని స్పష్టంచేశారు. తన దృష్టి అంతా రాష్ట్రం అభివృద్ధి, రాబోయే అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందని తెలిపారు.

‘‘ఎన్నికల అనంతరం అనేకమంది నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అది వారి హక్కు. వాటిపై స్పందించాలనుకోవడం లేదు. రాష్ట్ర అభివృద్ధిపైనే దృష్టిపెట్టాను. అదేవిధంగా మహాకూటమిగా సరికొత్త శక్తితో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపైనే ఆలోచన ఉంది’’ అని పుణెలో విలేకరులతో మాట్లాడుతూ అజిత్‌ తెలిపారు. అధికార మహాకూటమిలో భాజపా, శివసేన, ఎన్సీపీలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబరులో మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

కమలం అతివిశ్వాసం వల్లే.. ఎన్నికల ఫలితాలపై ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యాఖ్య

అనవసర రాజకీయాలూ లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను దెబ్బతీశాయంటూ.. ‘ఆర్గనైజర్‌’లో ఇటీవల ఓ కథనం వెలువడింది. ‘‘మహారాష్ట్రలో పార్టీలను చీల్చడం అనవసరం. భాజపా, శివసేనలకు అసెంబ్లీలో బలం ఉన్నా.. అజిత్‌ పవార్‌ను చేర్చుకోవడం తప్పిదమే. ఎన్సీపీలో అంతర్గత కలహాల వల్ల శరద్‌ పవార్‌ ఎలాగూ రెండు, మూడేళ్లలో కనుమరుగయ్యేవారు. కానీ.. అజిత్‌ను చేర్చుకోవడంతో కమలం పార్టీ కార్యకర్తలు మనస్తాపం చెందారు. ఒక్క దెబ్బతో అక్కడ భాజపా అన్ని పార్టీల్లాగే మారిపోయింది. ఎన్నోఏళ్లు కష్టపడి నిర్మించుకున్న కోట కూలిపోయింది’’ అని ఆర్‌ఎస్‌ఎస్‌ జీవితకాల సభ్యుడు రతన్‌ శార్దా వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని