Rajiv Gandhi: రాజీవ్‌ గాంధీ సాయాన్ని గుర్తుచేసుకొని వాజ్‌పేయీ కొనియాడిన వేళ

దివంగత భాజపా నేత, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ.. రాజీవ్‌ గాంధీ దాతృత్వాన్ని కొనియాడిన ఓ వీడియోను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ పంచుకున్నారు........

Published : 21 Aug 2022 01:21 IST

దిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 78వ జయంతి వేడుకలను కాంగ్రెస్‌ నేడు జరుపుకొంది. ఈ సందర్భంగా ఆ పార్టీ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ ఓ అరుదైన వీడియోను పంచుకున్నారు. దివంగత భాజపా నేత, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ.. రాజీవ్‌ గాంధీ దాతృత్వాన్ని కొనియాడిన సందర్భం అది. తాను కిడ్నీ సమస్యతో బాధపడుతూ డబ్బులు లేక చికిత్స కోసం అమెరికాకు వెళ్లేందుకు బాధపడుతున్న సమయంలో రాజీవ్‌ గాంధీ తన మంచి మనసును చాటుకున్నారని వాజ్‌పేయీ ఓ సందర్భంలో వెల్లడించారు.

కాగా అప్పటి వీడియోను జైరామ్‌ రమేశ్‌ నేడు ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ఆ వీడియోలో వాజ్‌పేయీ ఏమని చెప్పుకొచ్చారంటే.. ‘నేను కిడ్నీ సమస్యలు ఎదుర్కొన్నాను. మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడికి వెళ్లి వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. అయితే ఈ విషయం ఎలాగోలా రాజీవ్‌ జీ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన నన్ను పిలిచి, ఐక్యరాజ్యసమితి ప్రతినిధి బృందంలో నన్ను చేర్చాలని నిర్ణయించుకున్నారు. దీంతో నేను ప్రతినిధి బృందంలో పూర్తిస్థాయి సభ్యుడినయ్యాను. అన్ని వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించింది. ఫలితంగా పూర్తిగా కోలుకుని తిరిగి వచ్చాను’ అని రాజీవ్‌ గాంధీ దాతృత్వాన్ని వివరించారు.

వాజ్‌పేయీ జీవితం ఆధారంగా ఎన్‌.పి.ఉల్లేఖ్‌ రచించిన ‘ది అన్‌టోల్డ్‌ వాజ్‌పేయి’లోనూ రాజీవ్‌పై భాజపా నేత ప్రశంసలు కురిపించిన విషయాన్ని తెలియజేస్తూ జైరామ్‌ రమేశ్‌ మరో ట్వీట్‌ చేశారు. ఆ పుస్తకంలోని కొన్ని పేజీలను షేర్‌ చేశారు. ‘రాజీవ్ గాంధీ కేవలం ప్రభావవంతమైన ప్రధాని మాత్రమే కాదు. ఆయన రాజకీయాల్లో అరుదైన వ్యక్తి. మంచి మనిషి. సున్నితమైన వ్యక్తి’ అని వాజ్‌పేయీ అందులో పేర్కొన్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని