Published : 10 Dec 2021 01:36 IST

Bipin Rawat: బిపిన్‌ రావత్‌.. ‘అగ్గిపెట్టె’ సమాధానంతో ఆర్మీలో చేరి..!

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ అకాల మరణం.. యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మాతృభూమికి సేవలందించిన రావత్.. బుధవారం జరిగిన హెలికాప్టర్‌ దుర్ఘటనలో కన్నుమూశారు. స్వతహాగా సైనికుడి కుమారుడైన ఆయన.. తండ్రి స్ఫూర్తితో సైన్యంలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ఎన్నో కఠిన పరీక్షలను దాటుకుని ఉన్నత శిఖరాలను చేరుకున్నారు.  అవన్నీ ఎలా ఉన్నా.. సైన్యంలో చేరడానికి తాను ఎదుర్కొన్న తొలి ఇంటర్వ్యూ తనకు ఎప్పటికీ ప్రత్యేకమే అని చెప్పేవారు రావత్‌. ఆ రోజు తాను చెప్పిన ‘అగ్గిపెట్టె’ సమాధానమే తనను ఇక్కడిదాకా తీసుకొచ్చింది అనేవారు. 

రెండేళ్ల క్రితం సైన్యంలో చేరాలని ఆశిస్తున్న కొందరు విద్యార్థులతో జరిగిన ఓ ఇష్టాగోష్ఠిలో బిపిన్‌ రావత్‌ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని ఆయన పంచుకున్నారు. భారత సైన్యంలో అధికారులుగా చేరాలంటే యూపీఎస్‌సీ నిర్వహించే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఈ పరీక్షలో పాసైన రావత్.. ఆ తర్వాత అలహాబాద్‌లోని సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ ఎదుట ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అక్కడ పరీక్షలు, శిక్షణ పూర్తి చేసుకుని ఇంటర్వ్యూ వరకు చేరుకున్నారు. ఇంటర్వ్యూలో బ్రిగేడియర్‌ ర్యాంక్ అధికారి తనను ఇంటర్వ్యూ చేశారని రావత్‌ తెలిపారు. 

రావత్‌ జీవితాన్ని మార్చిన ఆ సమాధానం..

సెలక్షన్‌ రోజు జరిగిన ఘటనల గురించి రావత్ పంచుకున్నారు. ‘‘ఇంటర్వ్యూ చేసిన అధికారి ముందు నన్ను కొన్ని ప్రశ్నలు అడిగి ఆ తర్వాత హాబీలేంటో చెప్పమన్నారు. అప్పుడు నాకు చాలా హాబీలు ఉండేవి. అయితే ట్రెక్కింగ్‌ అంటే నాకు చాలా ఇష్టం. అదే విషయం వారికి చెప్పాను. ఇది విన్న వెంటనే ఆ అధికారి మరో ప్రశ్న వేశారు. ‘ఒకవేళ నువ్వు ఐదు రోజుల పాటు ట్రెక్కింగ్‌కు వెళ్లాల్సి వస్తే.. నీతో పాటు తీసుకెళ్లే అతి ముఖ్యమైన వస్తువు ఏది?’ అని ఆయన అడిగారు. నేను చాలా ఆలోచించి ‘అగ్గిపెట్టె’ తీసుకెళ్తానని చెప్పాను’’ అని రావత్‌ గుర్తుచేసుకున్నారు.

అయితే రావత్‌ సమాధానం విన్న వెంటనే ఆశ్చర్యానికి గురైన ఆ అధికారి.. ఎందుకో కాస్త వివరంగా చెప్పమని అడిగారు. దీనికి రావత్‌ స్పందిస్తూ.. ‘‘ఒకవేళ అగ్గిపెట్టె నాతో ఉంటే.. ఆ ఒక్క వస్తువుతో నేను ట్రెక్కింగ్‌లో చాలా పనులు చేసుకోగలను. అగ్ని అనేది ఆదిమమానవుడి అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణ. అది మానవాళి పరిణామానికి దోహదం చేసింది. ఈ ఆవిష్కరణను ఆదిమమానవుడు తన విజయంగా భావించాడు. అందుకే, నేను కూడా నా ట్రెక్కింగ్‌ సమయంలో ఇది అత్యంత ముఖ్యమైన వస్తువుగా భావించాను’’ అని చెప్పారట. 

అయితే ఇంత వివరణ ఇచ్చినప్పటికీ సంతృప్తి చెందని ఆ బ్రిగేడియర్‌.. తనను సమాధానం మార్చుకోవాలని ఒత్తిడి చేసినట్లు రావత్‌ అప్పుడు విద్యార్థులతో చెప్పారు. ‘‘ఆయన నన్ను ఎన్నో రకాలుగా ప్రశ్నించారు. సమాధానాన్ని మార్చుకునేలా ఒత్తిడి చేశారు. కానీ నేను నా సమాధానంపై గట్టిగా నిలబడ్డా. కొద్ది రోజుల తర్వాత ఇంటర్వ్యూలో సెలెక్ట్‌ అయినట్లు నాకు లేఖ వచ్చింది. ఆ తర్వాత ఎన్‌డీఏలో చేరి సైన్యానికి సేవలందించాను. ఎంత ఒత్తిడిలోనైనా నా జవాబుపై నేను గట్టిగా నిలబడటమే.. ఇంటర్వ్యూ ఎంపికలో కీలక పాత్ర పోషించింది’’ అని నాటి సంగతులను పంచుకున్నారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని