Updated : 30 Apr 2022 11:17 IST

Justice NV Ramana: విధుల నిర్వహణలో లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలి: జస్టిస్‌ ఎన్‌.వి. రమణ

దిల్లీ: మన కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నప్పుడు మనకున్న లక్ష్మణ రేఖను కూడా గుర్తుంచుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అన్నారు. కొన్ని ప్రభుత్వాలు కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ధిక్కరణ కేసులు పెరుగుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి అంత ఆరోగ్యకరం కాదని తెలిపారు. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల సీజేలు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు శనివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి. రమణతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ మాట్లాడుతూ.. ‘‘న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు అవసరం. న్యాయవ్యవస్థలో మౌలిక వసతులను త్వరతగతిన ఏర్పాటు చేయాలి. కేసుల పరిష్కారానికి మరింత సిబ్బంది కావాలి. కోర్టులో మానవ వనరుల కొరత తీరితే కేసుల భారం తగ్గుతుంది. న్యాయవ్యవస్థలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి. ఏడాది కాలంగా జడ్జీల నియామకాల్లో ప్రభుత్వం పూర్తిగా సహకరించింది’’ అని తెలిపారు.

ప్రజాస్వామ్యానికి మంచిది కాదు..

న్యాయవ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ పరస్పర సహకారంతో ముందుకు సాగితేనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అన్నారు. ‘‘ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నికైన వారిని అందరూ గౌరవించాల్సిందే. వార్డు సభ్యుడి నుంచి లోక్‌సభ సభ్యుడి వరకు అందరిని గౌరవించాలి. అయితే  కోర్టుల ఆదేశాలను కొన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ధిక్కరణ కేసులు పెరుగుతున్నాయి. న్యాయపరమైన తీర్పులు వచ్చినప్పటికీ ప్రభుత్వ ఉద్దేశపూర్వక చర్యలు ప్రజాస్వామ్యానికి అంత ఆరోగ్యకరం కావు’’ అని చెప్పుకొచ్చారు.

పర్సనల్‌ ఇంట్రెస్ట్ లిటిగేషన్‌గా మారుతున్నాయి..

ఈ సందర్భంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాల దుర్వినియోగంపై సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు వీటిని ‘పర్సనల్‌ ఇంట్రెస్ట్ లిటిగేషన్‌’గా మార్చుతూ.. వ్యక్తిగత వివాదాల పరిష్కారానికి ఉపయోగించుకోవడం బాధాకరమన్నారు. చట్టం అందరి విషయంలో సమానంగా ఉంటుందని, బాధితులకు న్యాయం అందించడంలో అంతర్భాగంగా ఉంటుందన్నారు.

న్యాయభాష అందరికీ అర్థమయ్యేలా ఉండాలి: ప్రధాని

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ.. దేశంలో ప్రధానమైన న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు చేపడతామన్నారు. న్యాయవ్యవస్థలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. ‘‘ఈ అమృత కాలంలో న్యాయ వ్యవస్థపై మనం దృష్టిపెట్టాలి. ప్రతి ఒక్కరికీ సులభంగా, త్వరతగతిన న్యాయం అందేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. దేశంలో న్యాయ విద్యను అంతర్జాతీయ ప్రమాణాలతో అందించాల్సిన అవసరం ఉంది. ఇక, ప్రస్తుతం కోర్టుల్లోని న్యాయ వ్యవహారాలన్నీ ఆంగ్ల భాషలోనే జరుగుతున్నాయి. సామాన్యులకు అర్తమయ్యేలా న్యాయ భాషను రూపొందించాల్సిన అవసరం ఉంది. కోర్టుల్లో స్థానిక భాషలకు ప్రాధాన్యమివ్వాలి. అప్పుడే సామాన్యులకు న్యాయ వ్యవస్థపై నమ్మకం మరింత పెరుగుతుంది’’ అని మోదీ సూచించారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts