White fungus: దేశంలో వైట్‌ ఫంగస్‌ కలకలం

కరోనా సెకండ్‌ వేవ్‌తో దేశం అల్లాడుతున్న వేళ ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు, మరణాలు భయపెడుతున్న....

Published : 21 May 2021 01:05 IST

పట్నా: కరోనా సెకండ్‌ వేవ్‌తో దేశం అల్లాడుతున్న వేళ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు, మరణాలు భయపెడుతున్న వేళ కొత్తగా వైట్‌ ఫంగస్‌ వెలుగుచూసింది. బిహార్‌లోని పట్నా వైద్య కళాశాలలో తాజాగా నాలుగు వైట్‌ ఫంగస్‌ కేసులు బయటపడ్డాయి. బ్లాక్‌ ఫంగస్‌ కంటే ఇది మరింత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైట్‌ ఫంగస్‌ ఉన్న నలుగురికీ కరోనా సోకలేదని తెలిపారు. వైట్‌ ఫంగస్‌ రోగుల్లో కరోనా లక్షణాలు మాత్రం ఉన్నాయని చెబుతున్నారు. 

పట్నా మెడికల్‌ కళాశాల మైక్రోబయాలజీ విభాగం హెడ్‌ డాక్టర్‌ ఎస్‌ఎన్‌ సింగ్ మాట్లాడుతూ.. నాలుగు వైట్‌ఫంగస్‌ కేసులు గుర్తించినట్టు వెల్లడించారు. ఈ నలుగురు రోగుల్లో కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించినప్పటికీ నెగెటివ్‌గా తేలిందన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. నలుగురు రోగులూ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారని, వారికి యాంటీ ఫంగల్‌ ఔషధాలు ఇస్తున్నట్టు తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌ కంటే వైట్‌ ఫంగస్‌ చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కేవలం ఊపిరితిత్తులపైనే కాకుండా శరీరంలోని ఇతర భాగాలైన గోళ్లు, చర్మం, పొట్ట, కిడ్నీలు, మెదడు, ప్రైవేటు భాగాలు, నోరు భాగాలపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

లక్షణాలేంటి?

కరోనా ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు కనబడుతున్న లక్షణాలే ఈ అరుదైన ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పడు కూడా కనబడుతున్నట్టు వైద్యులు తెలిపారు. ఇది ఊపిరితిత్తులపై దాడి చేస్తుందని, హెచ్‌ఆర్‌సీటీ టెస్ట్‌ చేయడం ద్వారా దీన్ని గుర్తించవచ్చని చెబుతున్నారు.

ఎవరికి ముప్పు ఎక్కువ?

బ్లాక్‌ ఫంగస్‌ సోకిన మాదిరిగానే తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి ఎక్కువగా సోకే అవకాశం ఉంటుంది. డయాబెటిస్‌, స్టిరాయిండ్లు ఎక్కువగా వాడటం వల్ల వైట్‌ఫంగస్‌ సోకే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని