Delhi: పార్లమెంట్‌లో మైక్‌లు ఆపరేట్‌ చేసేదెవరు? కాంగ్రెస్‌ వాదనలు నిజమేనా?

లోక్‌సభ (Lok Sabha)లో మైక్‌లను ఆఫ్‌ చేస్తున్నారంటూ రాహల్‌గాంధీ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. ఇంతకీ పార్లమెంట్‌లో మైక్‌లను ఎవరు ఆపరేట్‌ చేస్తారు? అవన్నీ ఎవరి అధీనంలో ఉంటాయి? 

Published : 17 Mar 2023 01:22 IST

దిల్లీ: పార్లమెంట్‌లో విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైక్‌లను నిలిపివేస్తున్నారంటూ రాహుల్‌ గాంధీ లండన్‌లో వ్యాఖ్యానించడం రాజకీయంగా దుమారం రేపింది. అంతేకాకుండా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదురి లోక్‌సభలో తన మైక్‌ను గత మూడు రోజులుగా సైలెంట్‌లో ఉంచారంటూ స్పీకర్‌ ఓం బిర్లాకు బుధవారం లేఖ రాశారు. ఈ నేపథ్యంలో అసలు సభ్యుల మైక్‌లను ఎవరు ఆపరేట్‌ చేస్తారు? ఏ సమయంలోనైనా కట్‌ చేయొచ్చా? లోక్‌సభ/ రాజ్యసభ స్పీకర్‌ స్థానంలో కూర్చున్నవారే స్వయంగా మైక్‌లను ఆపరేట్‌ చేస్తారా? దీని కోసం నిబంధనలేమైనా ఉన్నాయా?

ఎవరి మైక్‌ వారిదే..

పార్లమెంట్‌లో ప్రతి సభ్యుడికి నిర్దేశించిన సీటు, దానికి ఓ మైకు ఉంటుంది. వీటిని ఆపరేట్‌ చేసేందుకు లోక్‌సభలోనూ, రాజ్యసభలోనూ ప్రత్యేకమైన ఛాంబర్‌ ఒకటి ఉంటుంది. అందులో మైక్‌లను ఆపరేట్‌ చేసేందుకు వీలుగా ఎలక్ట్రానిక్‌ బోర్డు ఉంటుంది. సభ్యుల కుర్చీల ఆధారంగా వాళ్ల మైక్‌లకు ఒక నెంబర్‌ కేటాయిస్తారు.  సిబ్బంది వీటిని ఆపరేట్‌ చేస్తుంటారు. కేవలం అక్కడి నుంచి మాత్రమే సభ్యుల మైక్‌లను ఆన్‌/ఆఫ్‌ చేసే వెసులుబాటు ఉంటుంది. ఆ ఛాంబర్‌ చుట్టూ గట్టి గాజు అద్దాలు అమర్చుతారు. లోపల కూర్చున్న సిబ్బంది సభలో జరుగుతున్న అంశాలను పరిశీలిస్తూ.. అక్కడి కార్యకలాపాలను రికార్డు చేస్తుంటారు. దిగువ సభలో లోక్‌సభ సెక్రెటేరియేట్‌ సిబ్బంది, ఎగువ సభలో రాజ్యసభ సెక్రెటేరియేట్‌ సిబ్బంది వీటిని ఆపరేట్‌ చేస్తుంటారు.

స్పీకర్‌ చెప్పిందే చేయాలి

స్పీకర్‌ స్థానంలో కూర్చున్న వ్యక్తి ఆదేశాల మేరకే ఎలక్ట్రానిక్‌ బోర్డు ఆపరేట్‌ వాళ్లు పని చేయాల్సి ఉంటుంది. స్పీకర్‌ ఫలానా సభ్యుడికి మైక్‌ ఇవ్వాలని చెబితే, సిబ్బంది సంబంధిత మైక్‌ను ఆన్‌ చేస్తారు. అంతేతప్ప.. ఆటోమేటిక్‌గా పని చేసే వీలులేదు. మరికొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం మైక్‌కు టైమ్‌ను నిర్దేశిస్తారు. ఉదాహరణకు.. జీరో అవర్‌లో ఒక సభ్యుడు కేవలం మూడు నిమిషాలు మాత్రమే మాట్లాడేందుకు వీలుంది. ఆ సమయం ముగియగానే మైక్‌ దానంతటదే ఆగి పోతుంది. బిల్లులపై చర్చ సమయంలో మాత్రం స్పీకర్‌ ఆదేశాలను అనుసరించి అక్కడి సిబ్బంది మైక్‌లను ఆపరేట్‌ చేస్తుంటారు. అంతేకాకుండా ప్రత్యేక సందర్భాల్లో సభ్యులకు 250 పదాల్లో మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తారు. అది పూర్తవ్వగానే మైక్‌ ఆగిపోతుంది. స్పీకర్‌/ రాజ్యసభ ఛైర్మన్‌ స్థానంలో కూర్చున్న వ్యక్తి ఆదేశాల మేరకు ఈ సమయంలో అక్కడి సిబ్బంది మరో రెండు మూడు నిమిషాలు కేటాయించే అవకాశం ఉంది.

ఎక్కడివారు అక్కడే

అంతేకాకుండా ఎవరికి కేటాయించిన సీట్లలో వారే కూర్చొని, అక్కడి నుంచే మాట్లాడాలన్న నిబంధన కూడా ఉంది. లోక్‌సభ, రాజ్యసభలోని సభ్యులు, సిబ్బంది ఈ నిబంధనను కచ్చితంగా పాటించాల్సిందే. సభ్యులెవరైనా తన స్థానంలో నుంచి కాకుండా ఇతరుల స్థానం నుంచి మాట్లాడితే మైక్‌ ఆఫ్‌ చేసే హక్కు స్పీకర్‌ స్థానంలో కూర్చునే వ్యక్తికి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సభ్యులు సభాకార్యకలాపాలకు అడ్డుపడుతుంటే.. వాళ్ల మైక్‌ను ఆఫ్‌ చేయమనే హక్కు స్పీకర్‌కు ఉంటుంది. అంతేగానీ, రాజ్యసభ ఛైర్మన్‌ స్థానంలో ఉన్న వ్యక్తిగానీ, లోక్‌సభ స్పీకర్‌గానీ నేరుగా సభ్యుల మైక్‌లను ఆపరేట్‌ చేయరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని