సిరప్‌ల వాడకంతో 66 మంది చిన్నారుల మృతి.. భారత్‌ కంపెనీపై WHO అలర్ట్‌!

Indian syrups: భారత్‌లో ఓ కంపెనీ తయారు చేసిన సిరప్‌ల వల్లే గాంబియాలో 66 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది.

Updated : 06 Oct 2022 14:13 IST

ఐరాస/ జెనీవా: ఆఫ్రికా దేశమైన గాంబియాలో విషాదం చోటు చేసుకొంది. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కోసం వాడే సిరప్‌లు వినియోగించి 66 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. భారత్‌లో ఓ కంపెనీ తయారు చేసిన సిరప్‌ల వల్లే ఈ మరణాలు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. పలువురిలో కిడ్నీలు దెబ్బతినడానికి ఈ సిరప్‌లు కారణమయ్యాయని పేర్కొంది. ఈ మందులపై ఇతర దేశాలకూ డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక జారీ చేసింది.

గాంబియాలో మరణాలపై డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అదనోమ్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌లోని మైడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ తయారు చేసిన సిరప్‌లు చిన్నారులను బలి తీసుకున్నాయని వెల్లడించారు. డబ్ల్యూహెచ్‌ఓ దీనిపై విచారణ ప్రారంభించిందని చెప్పారు. చిన్నారుల మరణం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నాలుగు మందులు (Promethazine Oral Solution, Kofexmalin Baby Cough Syrup, Makoff Baby Cough Syrup, Magrip N Cold Syrup) హరియాణాలో తయారవుతున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. వాటి భద్రత, నాణ్యతకు సంబంధించి ఆ కంపెనీ ఇప్పటి వరకు డబ్ల్యూహెచ్‌ఓకు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిపింది.

ఈ మందులను ప్రస్తుతానికి గాంబియాలోనే గుర్తించామని, ఇతర దేశాలకు కూడా వీటి సరఫరా జరిగి ఉండొచ్చని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. మరింత నష్టం జరగకముందే వెంటనే అన్ని దేశాలూ ఆ ఉత్పత్తులు ప్రజల్లో పంపిణీ కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మందుల కారణంగా సెప్టెంబర్‌లో చిన్నారుల మరణాలు సంభవించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. లేబరేటరీలో ఆ నాలుగు మందులనూ పరిశీలించినప్పుడు వాటిల్లో మోతాదుకు మించి డైథిలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ కలిసినట్లు గుర్తించామని పేర్కొంది.

రంగంలోకి కేంద్రం

గాంబియాలో మరణాలకు భారత్‌ కంపెనీ కారణమైందంటూ డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. చిన్నారుల మరణాలపై డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI)ను డబ్ల్యూహెచ్‌ఓ అలెర్ట్‌ చేసిన నేపథ్యంలో కేంద్ర డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ వెంటనే రంగంలోకి దిగినట్లు తెలిసింది. పూర్తి స్థాయి విచారణ చేపట్టినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరోవైపు డబ్ల్యూహెచ్‌వో ఆరోపణలపై ఆ కంపెనీ ఇంత వరకు స్పందించలేదు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts