WHO చీఫ్‌ సైంటిస్ట్‌ పదవికి రాజీనామా చేయనున్న సౌమ్య స్వామినాథన్‌

ప్రపంచ ఆరోగ్య సంస్థచీఫ్‌ సైంటిస్ట్‌ బాధ్యతల్లో ఉన్న డా. సౌమ్య స్వామినాథన్‌.. ఆ బాధ్యతల నుంచి వైదొలగేందుకు సిద్ధమయ్యారు. పదవీ విరమణకు రెండేళ్ల సమయం ఉండగానే ముందస్తుగా రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు.

Published : 14 Nov 2022 15:55 IST

వాషింగ్టన్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్‌ సైంటిస్ట్‌ డా.సౌమ్య స్వామినాథన్‌ ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. నవంబర్‌ 30న చీఫ్‌ సైంటిస్ట్‌ పదవికి రాజీనామా చేయనున్నట్లు వెల్లడించిన ఆమె.. ఆ తర్వాత భారత్‌కు రావాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు. 63 ఏళ్ల వయసున్న సౌమ్య స్వామినాథన్‌ .. డబ్ల్యూహెచ్‌ఓలో ఇప్పటివరకు ఐదేళ్లపాటు పనిచేశారు. పదవీ విరమణకు ఇంకా సమయం ఉన్నప్పటికే.. రెండేళ్ల ముందస్తుగానే చీఫ్‌ సైంటిస్ట్‌ పదవికి రాజీనామా చేయనున్నారు. కొన్ని ఆచరణీయ కార్యక్రమాలపై విస్తృతంగా పనిచేయాలని భావిస్తున్నానని.. భారత్‌లోనే ఉంటూ తన సేవలను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు ఓ జాతీయ వార్తా పత్రికతో సౌమ్య స్వామినాథన్‌ వెల్లడించారు.

‘అంతర్జాతీయ స్థాయిలో ఐదేళ్లపాటు పనిచేసిన అనంతరం.. భారత్‌కు వచ్చి పరిశోధన, విధానపరమైన అంశాలపై పనిచేయాలని భావిస్తున్నా. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టే వివిధ ఆలోచనలు, ప్రణాళికలను ఆచరణలోకి తీసుకురావాలని కోరుకుంటున్నా. అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది నిపుణులతో అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకునే అవకాశం వచ్చింది. ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ చూపుతోన్న భారత్‌లో.. వీటిని అమలు చేసేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. విదేశాల్లో పనిచేయాల్సి వచ్చినప్పటికీ అది కొంత సమయం మాత్రమే. భారత్‌కు వచ్చి అక్కడే ఉంటూ నా సేవలను కొనసాగించాలని కోరుకుంటున్నా’ అని డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ అన్నారు.

చిన్న పిల్లల వైద్య నిపుణురాలైన డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌.. క్షయ, హెచ్‌ఐవీలపై పరిశోధనలతో అంతర్జాతీయ గుర్తింపు పొందారు. భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) డైరెక్టర్‌ జనరల్‌గా రెండేళ్లపాటు సేవలందించిన ఆమె.. 2017లో ప్రపంచ ఆరోగ్య సంస్థలో డిప్యూటీ డైరెక్టర్‌ (ప్రోగ్రామ్స్‌) పదవిలో చేరారు. అదే సమయంలో డబ్ల్యూహెచ్‌ఓలో సైన్స్‌ విభాగం ఏర్పాటు కావడంతో 2019 నుంచి అందులో చీఫ్‌ సైంటిస్ట్‌గా కొనసాగుతున్నారు. అలా ఐదేళ్ల నుంచి అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలో కొనసాగుతోన్న సౌమ్య స్వామినాథన్‌..  65ఏళ్లకు రిటైర్మెంట్‌ కావాల్సి ఉన్నప్పటికీ రెండేళ్ల ముందుగానే పదవిని వీడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని