Ambani bomb scare case: అంబానీకి బెదిరింపుల కేసులో.. ‘బాలాజీ కుర్‌కురే’

ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీ నివాసం ముందు పేలుడు పదార్థాలతో కూడిన వాహనం నిలిపివేత కేసులో తవ్వే కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Published : 10 Sep 2021 17:31 IST

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీ నివాసం ముందు పేలుడు పదార్థాలతో కూడిన వాహనం నిలిపివేత కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) 10వేల పేజీలతో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో సస్పెండ్‌కు గురైన పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ వాజేనే కీలక సూత్రధారి అని ఎన్‌ఐఏ పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ముంబయి మాజీ కమిషనర్‌ పరమ్‌ బీర్‌ సింగ్‌ గురించి కూడా కీలక విషయాలు బయటికొచ్చాయి. ఈ కేసులో పరమ్‌ బీర్‌.. బాలాజీ కుర్‌కురే పేరుతో నిందితులతో మాట్లాడినట్లు తెలిసింది. 

అంబానీకి బెదిరింపుల కేసులు, వ్యాపారి మన్‌సుఖ్‌ హీరేన్‌ హత్య కేసుపై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ.. ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ వాజే సహా పలువురు నిందితులను అరెస్టు చేసింది. ఆ తర్వాత ఈ నిందితులతో ఎవరెవరు రహస్య చర్చలు చేశారన్న దానిపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే ‘బాలాజీ కుర్‌కురే’ అనే ఫేస్‌టైం ఐడీ పేరు బయటికొచ్చింది. ఈ ఐడీతోనే ముంబయికి చెందిన ఓ అనుమానిత వ్యక్తి నిందితులతో రహస్యంగా చాట్‌ చేసినట్లు తెలిసింది. దీంతో ఎన్‌ఐఏ కూపీ లాగకా.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫేస్‌టైం ఐడీని ముంబయి మాజీ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ ఉపయోగించినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఎన్‌ఐఏ పేర్కొంది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో పరమ్‌బీర్‌ ఓ కొత్త ఫోన్‌ కొనుగోలు చేశారు. ఆ ఫోన్‌ ఇవ్వడానికి పరమ్‌బీర్‌ ఆఫీస్‌కు వచ్చిన వ్యక్తి అందులో ఫేస్‌టైంని యాక్టివేట్‌ చేశారు. ఐడీ పేరు ఏం పెట్టాలా అని చూస్తున్న సమయంలో అక్కడే టేబుల్‌పై ఉన్న బాలాజీ కుర్‌కురే ప్యాకెట్‌ను చూశాడు. దీంతో ఆ పేరుతోనే ఐడీని క్రియేట్‌ చేసినట్లు ఓ ఇంటెలిజెన్స్‌ అధికారి చెప్పారని ఎన్‌ఐఏ వెల్లడించింది. ఈ ఫేస్‌టైం ఐడీతోనే పరమ్‌బీర్‌.. సచిన్‌ వాజే సహా పలువురు నిందితులతో మాట్లాడినట్లు దర్యాప్తులో తేలిందని ఎన్‌ఐఏ తన ఛార్జ్‌షీట్‌లో తెలిపింది. 

నివేదిక మార్చేందుకు రూ.5లక్షలు..

అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలతో కూడిన వాహనం నిలిపిన వార్త బయటకు రాగానే జైషే ఉల్‌ హింద్‌ అనే ఉగ్రముఠా పేరుతో టెలిగ్రామ్‌లో ఓ పోస్ట్‌ వచ్చింది. అంబానీని బెదిరించింది తామేనంటూ ఆ ముఠా పేర్కొనట్లుగా ఉంది. అయితే దీని వెనుక కూడా పరమ్‌బీర్‌ సింగ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఓ సైబర్‌ నిపుణుడికి భారీ మొత్తంలో డబ్బు సమకూర్చినట్లు దర్యాప్తులో తేలింది. జైషే ఉల్‌ హింద్‌ పేరుతో వచ్చిన మెసేజ్‌.. అసలు అంబానీ నివాసానికి సంబంధించింది కాదు. కానీ పరమ్‌ బీర్‌ సింగ్‌ ఆదేశాలతో తాను ఆ నివేదిక ఇచ్చానని ఓ సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు చెప్పినట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. ఇందుకోసం పరమ్‌ బీర్‌ తొలుత రూ. 3లక్షలు ఇస్తానని ఒప్పుకోగా.. తర్వాత రూ. 5లక్షలు ఇచ్చినట్లు సమాచారం. అంతేగాక, మన్‌సుఖ్‌ హీరేన్‌ మృతి తర్వాత వాజే, మరో పోలీసు ప్రదీప్‌ శర్మను.. పరమ్‌బీర్‌ కలిశారని దర్యాప్తు సంస్థ పేర్కొంది. 

ఈ రెండు కేసుల్లో పరమ్‌బీర్‌పైనా విచారణ జరుగుతోంది. అయితే కొన్ని నెలలుగా ఆయన కన్పించకుండా పోయారు. ఆయనపై కేసుల విచారణకు సంబంధించి కోర్టు నోటీసులు వస్తున్నప్పటికీ ఆయన హాజరవ్వట్లేదు. పరమ్‌బీర్‌ ఫోన్‌నంబరు కూడా స్విచ్ఛాఫ్‌లో ఉన్నట్లు సమాచారం. 

ఈ ఏడాది ఫిబ్రవరి 25న ముంబయిలోని అంబానీ నివాసం ఎదుట జిలెటిన్‌ స్టిక్స్‌తో ఉన్న ఓ కారు నిలిపి ఉంచడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజులకు మార్చి 5న సదరు కారు యజమాని హీరేన్‌ శవమై కన్పించాడు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి సచిన్‌ వాజేనే అని, సూపర్‌ కాప్‌ అవ్వాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేశాడని ఇటీవల ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. అంతేగాక.. హీరన్‌ను హత్య చేయించింది కూడా అతడే అని వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని