Bimal Hasmukh Patel: కొత్త పార్లమెంట్‌ను చెక్కిన శిల్పి.. ఎవరీ బిమల్‌ పటేల్‌

New Parliament Designer: ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ యావత్ దేశం గర్వపడేలా నూతన పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. మరి ఈ అద్భుత భవనాన్ని డిజైన్‌ చేసింది ఎవరో తెలుసా?

Published : 29 May 2023 15:02 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దేశ చరిత్రలో సరికొత్త ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించే పార్లమెంట్‌ నూతన భవనాన్ని (new Parliament) ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) అట్టహాసంగా ప్రారంభించారు. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనం.. దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని అడుగడుగునా ప్రతిబింబిస్తోంది. మరి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ నూతన భవనాన్ని చెక్కిన శిల్పి ఎవరో తెలుసా..? ప్రముఖ ఆర్కిటెక్ట్‌ బిమల్‌ హస్ముఖ్‌ పటేల్‌ (Bimal Hasmukh Patel).

ఎవరీ బిమల్ పటేల్‌..

నూతన పార్లమెంట్‌ భవన రూపాన్ని డిజైన్‌ చేసింది గుజరాత్‌కు చెందిన హెచ్‌సీపీ డిజైన్స్‌ (HCP Designs) అనే సంస్థ. దాని యజమానే బిమల్‌ పటేల్‌ (Bimal Hasmukh Patel). గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన పటేల్‌ 1961 ఆగస్టు 31న జన్మించారు. ఆర్కిటెక్చర్‌ కళ పటేల్‌కు ఆయన తండ్రి నుంచే వచ్చింది. ఆయన తండ్రి హస్ముఖ్‌ చందూలాల్‌ పటేల్‌ వాస్తుశిల్పి. ఆయనే 1960లో హెచ్‌సీపీ సంస్థను ప్రారంభించారు. తండ్రికి తగ్గ వారసుడిగా బిమల్‌ పటేల్‌ కూడా ఇదే రంగంలోకి అడుగుపెట్టారు. అహ్మదాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్లానింగ్‌ అండ్‌ టెక్నాలజీ (CEPT)లో ఆర్కిటెక్చరల్‌ ఎడ్యుయేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లి.. కాలిఫోర్నియా యూనివర్శిటీ నుంచి రీజినల్‌ ప్లానింగ్‌లో పీహెచ్‌డీ సాధించారు. తాను చదివిన CEPT యూనివర్శిటీకి 2012లో ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. ఓవైపు విద్యావేత్తగా కొనసాగుతూనే హెచ్‌సీపీ సంస్థనూ నడిపిస్తున్నారు.

త్రికోణ ఆకారం అందుకే..

2019లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సెంట్రల్‌ విస్టా పునర్నిర్మాణ ప్రాజెక్ట్‌లో హెచ్‌సీపీ డిజైన్స్‌ సంస్థ కన్సల్టెన్సీ బిడ్‌ను దక్కించుకుంది. అలా పార్లమెంట్‌ను డిజైన్‌ చేసే బాధ్యత బిమల్‌ పటేల్‌కు దక్కింది. దేశ అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలకు చిహ్నాంగా సరికొత్తగా పార్లమెంట్‌ భవనాన్ని ఆయన డిజైన్‌ చేశారు. ‘రైజింగ్‌ ఇండియా’ను ప్రతిబింబించేలా దీన్ని తీర్చిదిద్దామని బిమల్‌ తెలిపారు. ఇక.. పాత పార్లమెంట్‌ వృత్తాకారంలో ఉండగా.. కొత్త పార్లమెంట్‌ను త్రికోణాకృతిలో తీర్చిదిద్దారు. దీని వెనుక ఓ ప్రత్యేక కారణం ఉందట. ‘‘దేశంలోని అన్ని సంస్కృతుల్లో త్రిభుజాలకు పవిత్ర ప్రాముఖ్యత ఉంటుంది. ఉదాహరణకు శ్రీయంత్రం, త్రిమూర్తులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. అందుకే ఆ నిర్మాణాన్ని ఎంచుకున్నాం. ఇక, లోక్‌సభ, రాజ్యసభ, సెంట్రల్‌ లాన్ ఇలా మూడు ప్రధాన భాగాలుగా పార్లమెంట్‌ను డిజైన్ చేశాం’’ అని బిమల్ పటేల్‌ ఓ సందర్భంలో తెలిపారు.

పార్లమెంట్‌తో పాటు బిమల్‌ పటేల్‌ ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు డిజైన్‌ చేశారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ధామ్‌, పూరీలోని జగన్నాథ ఆలయ మాస్టర్‌ ప్లానింగ్‌ను రూపొందించింది ఈయన సంస్థే. తన ప్రతిభతో ఎన్నో అవార్డులు పొందారు. ఆయన సేవలకు గానూ.. 2019లో కేంద్ర ప్రభుత్వం బిమల్‌ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని