Updated : 23 Feb 2022 19:56 IST

Nawab Malik: ఎవరీ నవాబ్‌ మాలిక్‌? అరెస్టయిన ఈ మంత్రి గురించి మీకు తెలుసా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం, అతడి అనుచరులకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్సీపీ సీనియర్‌ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ అరెస్టయ్యారు. ఈ కేసులో ఉదయం ఆయన్ను విచారణకు పిలిచిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు.. మంత్రిని అరెస్టు చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర దర్యాప్తు సంస్థల వినియోగంపై గత కొంత కాలంగా మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం జరుగుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. నవాబ్‌ మాలిక్‌ నోరు నొక్కేందుకే కేంద్రం ఇలాంటి కక్షపూరిత వైఖరిని అనుసరిస్తోందని ఎన్సీపీ, శివసేన నేతలు ఆరోపిస్తున్నారు. గతేడాది షారుక్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ను డ్రగ్స్‌ కేసులో ఎన్సీబీ అధికారులు అరెస్టు చేసిన సమయంలో సంచలన వ్యాఖ్యలతో మాలిక్‌ జాతీయస్థాయిలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

  1. ఎవరీ నవాబ్‌ మాలిక్‌?: నవాబ్‌ మాలిక్‌ యూపీలోని గోండా జిల్లా ధుస్వా గ్రామంలో 1959 జూన్‌ 20న జన్మించారు. ఆయన కుటుంబానికి ముంబయిలో వ్యాపారాలు ఉండటంతో మూడు నెలల ప్రాయంలోనే ముంబయి నగరానికి వచ్చి స్థిరపడ్డారు. డోంగ్రిలో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. నవాబ్‌ మాలిక్‌ ముంబయిలోని అణుశక్తి నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీకి జాతీయ అధికార ప్రతినిధిగా, ప్రస్తుతం మహారాష్ట్ర మైనార్టీ డెవలప్‌మెంట్‌ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. 
  2. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇలా..: సంజయ్‌ గాంధీని చూసి ఆకర్షితుడైన మాలిక్‌.. తొలుత యూత్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఆయన మరణానంతరం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ఉద్యమించిన మేనకా గాంధీ ఏర్పాటు చేసిన సంజయ్ విచార్ మంచ్‌లో చేరారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అభ్యర్థుల్ని నిలబెట్టాలని మంచ్‌ నిర్ణయించింది. అప్పుడు మాలిక్‌కు 26 ఏళ్లు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన్ను పోటీ చేయాలని అడగడంతో బాంబే నార్త్‌ ఈస్ట్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. అప్పటికే కీలక నేతలైన గురుదాస్‌ కామత్‌, ప్రమోద్‌ మహజన్‌లకు వ్యతిరేకంగా బరిలో దిగిన మాలిక్‌కు కేవలం 2950 ఓట్లు మాత్రమే వచ్చాయి. 
  3. 1992లో ముంబయి అల్లర్ల తర్వాత నవాబ్‌ మాలిక్‌ సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. నెహ్రూనగర్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి శివసేన అభ్యర్థి సూర్యకాంత్‌ మహాదిక్‌ చేతిలో ఓటమిపాలై రెండో స్థానంలో నిలిచారు. అయితే, మహాదిక్‌ ఎన్నికను సుప్రీంకోర్టు పక్కనపెట్టడంతో 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో 7వేల ఓట్ల తేడాతో మాలిక్‌ తొలిసారి విజయం సాధించారు. 1999లో సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై బరిలో దిగి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలుచుకున్న సమాజ్‌వాదీ పార్టీ.. కాంగ్రెస్‌, ఎన్సీపీ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంతో మంత్రి పదవి ఆఫర్‌ చేశారు. దీంతో సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న నవాబ్‌ మాలిక్‌ తొలిసారి గృహనిర్మాణశాఖ మంత్రిగా అవకాశం దక్కింది.  
  4. కేబినెట్‌లోకి ప్రవేశించిన కొద్ది నెలల తర్వాత ఆయన క్రమంగా సమాజ్‌వాదీ పార్టీకి దూరమయ్యారు. అక్టోబర్‌ 13, 2001న ఆయన పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత నాలుగు రోజుల్లోనే శరద్‌ పవార్‌ సారథ్యంలోని ఎన్సీపీలో చేరిపోయారు. శరద్‌ పవర్‌కు సన్నిహితుడిగా ఉంటూ కీలక పదవుల్లో పనిచేశారు. కాంగ్రెస్‌-ఎన్సీపీ ప్రభుత్వంలో ఉన్నత విద్య, సాంకేతిక విద్య, కార్మికశాఖ మంత్రిగా ఉన్నారు. 
  5. మాలిక్‌పై అన్నాహజారే అవినీతి ఆరోపణలు: అయితే, ప్రముఖ సామాజిక ఉద్యమనేత అన్నా హజారే.. మంత్రి నవాబ్‌మాలిక్‌తో పాటు కాంగ్రెస్‌-ఎన్సీపీకి చెందిన మరో ముగ్గురు మంత్రులపై అవినీతి ఆరోపణలు చేశారు. ఓ ప్రయివేటు బిల్డర్‌కు లబ్ధి చేకూర్చేలా మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా ముంబైలోని ఓ భారీ భవనం పునర్నిర్మాణాన్ని మాలిక్‌ నిలుపుదల చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో 2005లో మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేసిన జస్టిస్ పీబీ సావంత్ కమిషన్ కఠిన చర్యలతో మాలిక్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే, ఆ బిల్డర్‌కు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించింది తాను కాదనీ.. గతంలో ఉన్న శివసేన-భాజపా ప్రభుత్వమేనంటూ ఆయన వాదించారు.
  6. మూడేళ్ల విరామం తర్వాత అశోక్‌ చవాన్‌ సారథ్యంలో ఏర్పాటైన ప్రభుత్వంలో 2008లో నవాబ్‌ మాలిక్‌ కార్మికశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 2009లో కాంగ్రెస్‌ ఎన్సీపీ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటికీ మాలిక్‌కు కేబినెట్‌లో చోటుదక్కలేదు. దీంతో ఆయన ఎన్సీపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు.  2014 ఎన్నికల్లో మాలిక్‌ 1007 ఓట్ల తేడాతో పరాజయం పాలైనప్పటికీ పార్టీ సంస్థాగత కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించారు. 
  7. ఎన్సీపీలో కొద్దిమంది ముస్లిం నేతల్లో నవాబ్‌ మాలిక్‌ ఒకరు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు భాజపా సోషల్‌ మీడియా యంత్రాంగాన్ని ఎదుర్కోవడంలో అధికారప్రతినిధిగా కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఏర్పాటైన మహావికాస్‌ ఆఘాడీ ప్రభుత్వంలో దాదాపు దశాబ్ద కాలం తర్వాత మళ్లీ మంత్రిగా రీఎంట్రీ ఇచ్చారు. ఆయన్ను శరద్‌పవార్‌కు సన్నిహితుడిగా పేర్కొంటారు. 
  8. గతేడాది జనవరిలో మాలిక్‌ అల్లుడు, వ్యాపారవేత్త సమీర్‌ షబ్బీర్‌ఖాన్‌ను సమీర్‌ వాంఖడే సారథ్యంలోని ఎన్సీబీ అరెస్టు చేసింది. అప్పటికే బ్రిటిష్‌ జాతీయుడు కరణ్ సాజ్నానీని అరెస్టు చేసిన ఎన్సీబీ.. అతడి నుంచి 75 కిలోల గంజాయి, 125 కిలోల గంజాయి సంబంధిత పదార్థాలను స్వాధీనం చేసుకుంది. సాజ్నానీని విచారించడంతో అతడికి, షబ్బీర్‌ఖాన్‌కు మధ్య డబ్బు మార్పిడి జరిగినట్టు గుర్తించామని ఎన్సీబీ పేర్కొంది. ఆ తర్వాత షబ్బీర్‌ ఖాన్‌ను పిలిపించి గతేడాది జనవరి 9న అరెస్టు చేసింది. అనంతరం సెప్టెంబర్‌లో అతడికి బెయిల్‌ మంజూరైంది. అయితే, తన అల్లుడిని ఇరికించారంటూ నవాబ్‌ మాలిక్‌ అప్పట్లో ఆరోపించారు. 
  9. ఆ తర్వాత కొన్నాళ్లకే బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో ఎన్సీబీ అరెస్టు చేసినప్పుడు నవాబ్‌ మాలిక్‌ ఎన్సీబీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. క్రూజ్‌ నౌకలో డ్రగ్స్‌ దొరికాయంటూ ఎన్సీబీ చెప్పడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  వాంఖడే తప్పుడు మాదకద్రవ్యాల కేసులను నమోదు చేశారని, రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు బీజేపీ పావుగా వ్యవహరిస్తున్నారని మాలిక్‌ అప్పట్లో ఆరోపణలు గుప్పించి జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
  10. ఫిబ్రవరి 15న ముంబయిలో 10 చోట్ల ఈడీ అధికారులు సోదాలు జరిపారు. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ సమీప బంధువుల ఇళ్లల్లో తనిఖీలు చేసి.. దావూద్‌ సోదరుడు ఇక్బాల్‌ కస్కర్‌ని అరెస్టు చేశారు. అతడిని విచారించగా..మంత్రి నవాబ్ మాలిక్ కొనుగోలు చేసిన ఆస్తికి సంబంధించిన కొన్ని ఆధారాలు బయటకొచ్చినట్టు సమాచారం. దీంతో మంత్రిని విచారణకు పిలిచిన అధికారులు.. ఆయనను అరెస్టు చేశారు. విచారణకు సహకరించనందునే అరెస్టు చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. 
Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని