అంబానీకి బెదిరింపుల కేసులో ‘అతడి’ హస్తం..?

ముంబయిలో అయనో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు.. దాదాపు 63 మందిని కాల్చి చంపి కిల్లింగ్‌ మిషిన్‌గా పేరు తెచ్చుకొన్నారు. ఓ బాంబు పేలుడు కేసులో నిందితుడు తన కస్టడీలో మరణించడంతో సస్పెన్షన్‌ వేటుకు గురైయ్యాడు.. ఆ తర్వాత కేసు తేలకపోవడంతో రాజీనామా చేసి

Updated : 15 Mar 2021 14:24 IST

‘కారుబాంబు’కేసులో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుపై అనుమానాలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ముంబయిలో అయనో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు.. దాదాపు 63 మందిని కాల్చి చంపి కిల్లింగ్‌ మెషిన్‌గా పేరు తెచ్చుకొన్నారు. ఓ బాంబు పేలుడు కేసులో నిందితుడు తన కస్టడీలో మరణించడంతో సస్పెన్షన్‌కు గురయ్యాడు.. ఆ తర్వాత కేసు తేలకపోవడంతో రాజీనామా చేసి ఓ పార్టీలో చేరాడు.. అంతేకాదు.. అత్యాధునిక సాంకేతికత వాడటంలో నిపుణుడైన అతడు ఫోన్‌ హ్యాకింగ్‌ వంటి సాధానాలు చేసినట్లు కూడా చెప్పుకొన్నాడు.  రెండు పుస్తకాలు కూడా రాశాడు.  కానీ, 2020లో మళ్లీ ముంబయి పోలీసు శాఖలో చేరాడు. హోదా చిన్నదైనా హైప్రొఫైల్‌ కేసులు అతని వద్దకే వచ్చేవి.. చివరికి ముఖేశ్‌ అంబానీకి బాంబు బెదిరింపుల కేసులోº కూడా మొదట్లో ఆయనే హడావుడి చేశాడు. కానీ, అదే కేసులో ఇప్పుడు అనుమానితుడిగా అరెస్టయ్యాడు. అతడే ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు సచిన్‌ వాజే‌..!

ఎవరీ సచిన్‌ వాజే‌..

1990లో మహారాష్ట్ర పోలీసు విభాగంలో చేరిన సచిన్‌ తొలుత నక్సల్‌ ప్రభావిత గడ్చిరౌలిలో పనిచేశాడు. ఆ తర్వాత థానే పోలీస్‌ ప్టేషన్‌కు బదిలీ అయ్యాడు. అక్కడి నుంచి పెద్దకేసులు దర్యాప్తు చేస్తూ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా పేరు తెచ్చుకొన్నాడు. 2003లో ఘుట్‌కోపర్‌ బాంబు పేలుడు కేసులో క్వాజా యూనిస్‌ అనే ఇంజినీర్‌ను అరెస్టు చేశాడు. అతడు కస్టోడియల్‌ డెత్‌కు గురయ్యాడు. ఈ కేసులో 2004లో సస్పెండ్‌ అయ్యాడు. అప్పటి నుంచి పోస్టింగ్‌ ఇవ్వక పోవడంతో 2008లో పోలీస్‌శాఖకు రాజీనామా చేసి శివసేనలో చేరాడు. సాంకేతికతపై మంచి పట్టున్న సచిన్‌ 2010లో లాయ్‌భరి అనే సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ను ప్రారంభించాడు. దీంతోపాటు ఫోన్‌కాల్స్‌ వినడం, మెసెజ్‌లను చూసేలా ఓ సాఫ్ట్‌వేర్‌ కూడా అభివృద్ది చేసినట్లు చెప్పుకొన్నాడు. అతని వద్ద నిత్యం అత్యాధునిక పరికరాలు ఉండేవని సన్నహితులు చెబుతుంటారు. దీంతోపాటు షీనాబోరా హత్య, 26/11లో డేవిడ్‌ హెడ్లీపై రెండు పుస్తకాలు కూడా రాశాడు.

మళ్లీ కీలక పోస్టింగ్‌..!

మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో కొవిడ్‌ వ్యాపించడంతో పోలీసు అధికారులు సరిపోవడంలేదంటూ సచిన్‌వాజేకు అత్యంత కీలకమైన  క్రైమ్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌లో  పోస్టింగ్‌ ఇచ్చారు. ఆయన చాలా కీలకమైన కేసుల దర్యాప్తులో భాగం అయ్యారు. టీఆర్పీ కుంభకోణం, ఓ ఆత్మహత్య కేసులో ఓ టీవీ చీఫ్‌ ఎడిటర్‌ అరెస్టు కేసు, హృతిక్‌ రోషన్‌కు ఫేక్‌ ఈమెయిల్‌ కేసు, కార్‌ డిజైనర్‌ దిలీప్‌ ఛాబ్రియా కుంభకోణం కేసు వంటివి సచిన్‌ పర్యవేక్షించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 25న రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ ఇంటి వద్ద ఓ స్కార్పియో వాహనంలో కొన్ని జిలెటిన్‌ స్టిక్స్‌ బయటపడ్డాయి. వీటిలో డిటోనేటర్‌ లేదు కాబట్టి ఎటువంటి ప్రమాదం జరగలేదు. లేకపోతే 350 మీటర్ల వరకు పేలుడు ప్రభావం ఉండేది. ఈ కేసు దర్యాప్తునకు తొలుత అక్కడకు వచ్చిన వారిలో సచిన్‌ వాజే కూడా ఉన్నారు. ఇక ఆ వాహనం యజమాని థానేలోని కార్ల ఇంటీరియర్‌ వ్యాపారి మన్‌సుఖ్‌ హిరెన్‌గా గుర్తించారు. అప్పటికి వారం ముందే మన్‌సుఖ్‌ తన వాహనం ఒక చోట నిలిపితే అపహరించారని కేసు పెట్టారు. ఆయన వాహనం అపహరణకు గురైనట్లు చెబుతున్న చోట  సీసీ కెమెరాలు లేవు.

మన్‌సుఖ్‌ మరణంతో..

అంబానీకి బెదిరింపుల కేసు దర్యాప్తులో ఉండగానే ముంబయి నుంచి థానేకు వెళ్లే మార్గంలోని ఓ సముద్రపు పాయలో మన్‌సుఖ్‌ మృతదేహం బయటపడటంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అతని మాస్క్‌ వెనుక ఐదు హ్యాండ్‌ కర్చిఫ్‌లను పోలీసులు గుర్తించారు.  దీనికి తోడు శరీరం పైగాయాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.  మన్‌సుఖ్‌ మంచి ఈతగాడు కావడంతో  దీనిని హత్యగా పేర్కొంటూ ఆయన కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. పేలుడు పదార్థాలు ఉంచిన కారును గతంలో నాలుగు నెలలు ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు సచిన్‌ వాడినట్లు మన్‌సుఖ్‌ కుటుంబీకులు ఆరోపించారు. ఇటీవలే అది తమ చేతికి వచ్చిందని వెల్లడించారు. నవంబర్‌లో అర్ణబ్‌ గోస్వామి అరెస్టు సమయంలో ముంబయిలోని వర్లీకి ఇదే స్కార్పియోలో సచిన్‌ వచ్చినట్లు ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ కథనంలో పేర్కొంది.

మన్‌సుఖ్‌ కుటుంబీకుల ప్రకటన రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. దీనికి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ప్రకటన కూడా తోడైంది.  దీంతో మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. గత శుక్రవారం సచిన్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

ఆసక్తికర అంశాలు..

రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ సచిన్‌ను గతవారం అదుపులోకి తీసుకొని కొన్ని గంటలపాటు ప్రశ్నించింది. ఆ తర్వాత అరెస్టు చేసి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి 14వ తేదీన కోర్టు ముందు ప్రవేశపెట్టింది. న్యాయస్థానం ఈ నెల 25 తేదీ వరకు ఎన్‌ఐఏ కస్టడీ విధించింది. ఇక స్కార్పియో యజమాని శామ్‌ న్యూటన్‌ను కూడా ప్రశ్నించనుంది. వాస్తవానికి స్కార్పియో అసలు యజమాని శామ్‌ న్యూటన్‌. మన్‌సుక్‌ వద్ద దాదాపు లక్షల విలువైన కారు ఇంటీరియర్‌ పనిచేయించుకొని అతను డబ్బు ఇవ్వలేదు. దీంతో ఆ పాత కారును మన్‌సుఖ్‌కు వదిలేశాడు. తర్వాత మన్‌సుఖ్‌ నుంచి సచిన్‌ చేతికి వెళ్లింది.

నిందితులు పేలుడు పదార్థాలున్న కారును అంబానీ ఇంటి సమీపంలో వదిలేసిన తర్వాత వాడిన ఇన్నోవా వాహనం క్రైమ్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌దిగా అనుమానిస్తున్నారు. దీంతో సీఐయూలోని మరికొందరు అధికారులను ప్రశ్నించే అవకాశం ఉంది. దర్యాప్తు పూర్తి అయ్యేవరకు ఈ మిస్టరీ కొనసాగే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని