Karnataka: టిప్పు సుల్తాన్‌పై రగులుకొన్న రాజకీయం

Karnataka: కర్ణాటకలో ఎన్నికలు దగ్గరపడే కొద్దీ టిప్పుసుల్తాన్‌పై రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆయన మరణంపై  తాజాగా కర్ణాటకలో రాజకీయపార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకొంటున్నాయి.

Updated : 23 Mar 2023 13:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కర్ణాటక (Karnataka)లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అలనాటి మైసూర్‌ పాలకుడు టిప్పు సుల్తాన్‌పై భాజపా (BJP) నాయకుడు వివాదాస్పద ప్రకటన చేశారు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సి.టి.రవి ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ.. తాను టిప్పు సుల్తాన్‌ కాలంలో పుట్టి ఉంటే ‘ఊరి గౌడ, నంజే గౌడ’ వలే తిరుగుబాటు చేసేవాడినని పేర్కొన్నారు. పాత మైసూర్‌ ప్రాంతంలోని  కొన్ని వర్గాలు, భాజపా నాయకులు ఈ ప్రకటనకు మద్దతుగా నిలిచాయి. టిప్పు సుల్తాన్‌తో వక్కలిగ పాలకులు ఊరి గౌడ, నంజే గౌడ యుద్ధం చేశారని.. దానిలో టిప్పు మరణించినట్లు  వీరు నమ్ముతున్నారు. ఈ అంశం ఇప్పుడు వివాదానికి బీజం వేసింది.

చిక్‌మగళూరులో జరిగిన  సభలో సి.టి.రవి మాట్లాడుతూ ‘‘టిప్పు పాలించే సమయంలో నేను పుట్టి ఉంటే.. ఊరిగౌడ, నంజే గౌడ వలే ఉండేవాడిని. తిరుగుబాటు చేసేవాడిని’’ అని వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని బలమైన వక్కలిగ సామాజిక వర్గానికి చెందిన  నేతల్లో రవి కూడా ఒకరు. వాస్తవానికి టిప్పు మరణంపై గతంలో చర్చ జరిగింది. అయితే.. గతేడాది ‘టిప్పువిన నిజ కనసుగలు’ పేరిట ఓ నాటకం విడుదలైన సమయంలో ‘ఊరి గౌడ, నంజే గౌడ’ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. దీనికి రంగాయణ(థియేటర్‌ ఇన్‌స్టిట్యూట్‌) డైరెక్టర్‌ అడ్డండ కరియప్పా దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో ఓ వర్గాన్ని బుజ్జగించేలా రాజకీయాలు చేస్తున్నాయంటూ కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌)లను విమర్శించడానికి భాజపా దీనిని వాడుకొంటోంది. మరోవైపు భాజపా ప్రకటనను ప్రతిపక్ష కాంగ్రెస్‌, జేడీఎస్‌, చరిత్రకారులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.  ఊరి గౌడ, నంజే గౌడ అనే పాలకులు వాస్తవంగా అసలు లేరని.. కేవలం కల్పిత పాత్రలు మాత్రమే అని చెబుతున్నారు. 

మరోవైపు కర్ణాటక ఉద్యానశాఖ మంత్రి మునిరత్న ఈ అంశంపై చిత్రనిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఊరిగౌడ-నంజేగౌడ పేరిట చిత్ర టైటిల్‌ను కూడా రిజిస్టర్‌ చేశారు. దీంతో వక్కలిగ వర్గానికి ముఖ్యమైన శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థ మఠం పీఠాధిపతి నిర్మలానంద స్వామిజీ ఈ వ్యవహారంపై స్పందించారు. చారిత్రక సమాచారం, ఆధారాలు, రికార్డులను మఠానికి అందించాలని కోరారు. అంతేకాదు ఆధారాలు లేకుండా ఎటువంటి చిత్రం నిర్మించవద్దని మంత్రి మునిరత్నకు విజ్ఞప్తి చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని