WHO: 1,15,000 ఆరోగ్య సంరక్షణ సిబ్బంది బలి!

కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భయానక పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి స్పష్టంచేసింది.

Published : 24 May 2021 19:49 IST

ప్రపంచ వ్యాప్తంగా భయానక పరిస్థితులు ఉన్నాయన్న WHO

జెనీవా: కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా అత్యంత భయానక పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి ఆందోళన వ్యక్తంచేసింది. గతేడాది మొత్తంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇప్పటివరకు నమోదైన కేసులే ఎక్కువని పేర్కొంది. అంతేకాకుండా 2020లో సంభవించిన కొవిడ్‌ మరణాల సంఖ్య ఈ ఏడాది మరికొన్ని వారాల్లోనే అధిగమించే పరిస్థితి ఏర్పడిందని డబ్ల్యూహెచ్‌ఓ అభిప్రాయపడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక సమావేశంలో మాట్లాడిన సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రెయేసస్‌, కరోనా వైరస్‌ మహమ్మారి విషయంలో యావత్‌ ప్రపంచం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని పునరుద్ఘాటించారు.

లక్షా 15వేల మంది ఆరోగ్య కార్యకర్తలు మృతి..

‘గడిచిన 18 నెలలుగా వైద్య ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు జీవన మరణ పోరాటంలో సేవలందిస్తున్నారు. ఆరోగ్య సేవల్లో నిమగ్నమైన వీరిలో ఎంతోమంది వైరస్‌ బారినపడుతున్నారు. నమోదవుతున్న కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కనీసం లక్షా 15వేల మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా’ అని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ ఆవేదన వ్యక్తంచేశారు.

ఇక వ్యాక్సిన్‌ సరఫరాలో అవమానకరమైన అసమానత్వం చోటుచేసుకుంటుందని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో సెప్టెంబర్‌ నాటికి కనీసం 10శాతం మందికి వ్యాక్సిన్‌ అందించేందుకు  కృషి చేయాలని డబ్ల్యూహెచ్‌ఓలోని 194 సభ్య దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం పేద, మధ్య ఆదాయ దేశాలకు వ్యాక్సిన్‌ అందించేందుకు ఏర్పాటు చేసిన ‘కొవాక్స్‌’ కార్యక్రమానికి టీకాలను అందించాలని ఆయా దేశాలతో పాటు తయారీ సంస్థలను డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ కోరారు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 16కోట్ల మందిలో వైరస్‌ బయటపడగా.. వీరిలో 35లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఓవైపు మహమ్మారి మూలాలపై మిస్టరీ కొనసాగుతూనే ఉండగా.. మరోవైపు ధనిక దేశాలు వ్యాక్సిన్‌లను దాచిపెట్టుకుంటున్నాయనే వాదనలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ సరఫరాతో పాటు మరో విపత్తును నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక సమావేశంలో చర్చించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని