
కరోనాపై WHO నోట చైనా మాట
ప్రపంచ ఆరోగ్య సంస్థపై డ్రాగన్ ఒత్తిడి?
బీజింగ్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి బయటపడి ఏడాది పూర్తయినా ఇప్పటికీ ఆ వైరస్ ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై స్పష్టత లేదు. కొవిడ్ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) బృందం దర్యాప్తు జరిపినా ఇంకా ఆ నివేదికను వెల్లడించలేదు. అయితే అంతకంటే ముందుగానే దీనిపై చైనా వివరణ ఇచ్చేసింది. గబ్బిలాలు, శీతలీకరించిన ఆహారం ద్వారానే వైరస్ వ్యాప్తి జరిగి ఉంటుందని తెలిపింది. వుహాన్ ల్యాబ్ నుంచి ఇది బయటకొచ్చే ఆస్కారమే లేదన్నది. కాగా.. డబ్ల్యూహెచ్వో కూడా దర్యాప్తు తమ నివేదికలో ఇవే విషయాలు పేర్కొన్నట్లు తాజాగా తెలిసింది.
కరోనా మూలాలపై డబ్ల్యూహెచ్ఓ రూపొందించిన నివేదిక ముసాయిదాను ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ది అసోసియేటెడ్ ప్రెస్(ఏపీ) సంపాదించింది. ఈ నివేదికలో కొవిడ్ వైరస్ గబ్బిలాల నుంచి ఒక మధ్యంతర జంతువులోకి వ్యాపించి.. దాన్నుంచి మానవుల్లోకి విస్తరించిందని పేర్కొన్నట్లు ఏపీ కథనం వెల్లడించింది. ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయ్యే అవకాశాలను కొట్టిపారేసినట్లు తెలిపింది. సరిగ్గా చైనా ఏదైతే వివరణ ఇచ్చిందో అదే నివేదికలోనూ ఉండటం గమనార్హం.
నిజానికి ఈ నివేదికను ఇప్పటికే విడుదల చేయాల్సి ఉండగా.. ఆలస్యమవుతుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. మహమ్మారి వ్యాప్తికి చైనానే కారణమన్న అపవాదును తొలగించుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థపై డ్రాగన్ ఒత్తిడి తెస్తోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ డ్రాఫ్ట్ నివేదికను జెనీవాకు చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడని దౌత్యవేత్త ఒకరు బయటపెట్టినట్లు ఏపీ పేర్కొంది. అయితే తుది నివేదికను ఇలాగే విడుదల చేస్తారా లేదా ఏవైనా మార్పులు చేస్తారా అన్నదానిపై స్పష్టత లేదు.
2019 చివర్లో కరోనా వైరస్ కేసులు మొట్టమొదటిసారిగా చైనాలోని వుహాన్ నగరంలో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్వోకు సంబంధించిన అంతర్జాతీయ నిపుణుల బృందం జనవరిలో వుహాన్లో పర్యటించింది. చైనా శాస్త్రవేత్తలతో కలిసి వారు పరిశీలనలు సాగించారు. తుది నివేదికపై రెండు పక్షాలూ ఆమోదం తెలపాల్సి ఉంది. అది ఎప్పుడు వెలువడుతుందన్నది అంతుచిక్కకుండా ఉంది. డబ్ల్యూహెచ్వో అధ్యయనంపై చైనా ప్రభావం, పరిశోధనలో తేలిన అంశాల స్వతంత్రతపై అమెరికా సహా పలు దేశాలు ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ నేపథ్యంలో స్పందించిన చైనా.. కరోనా విషయంలో తాము పారదర్శకంగా వ్యవహరించామని చెప్పింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.