Delta Variant: డెల్టా ఓ హెచ్చరిక.. అదుపు చేయకపోతే మరిన్ని ప్రమాదకర వేరియంట్లు!

ప్రపంచవ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్‌ భారీ స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) దేశాలకు కీలక సూచనలు చేసింది. డెల్టా వేరియంట్‌ వ్యాప్తి....

Updated : 31 Jul 2021 11:16 IST

మహమ్మారి వ్యాప్తిపై డబ్ల్యూహెచ్‌ కీలక వ్యాఖ్యలు

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్‌ భారీ స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) దేశాలకు కీలక సూచనలు చేసింది. డెల్టా వేరియంట్‌ వ్యాప్తి.. మరిన్ని ప్రమాదకరమైన వేరియంట్లు పుట్టకముందే మహమ్మారిని అదుపు చేయాలన్న హెచ్చరిక జారీ చేస్తోందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో కరోనాను అంతం చేసే దిశగా వేగవంతమైన చర్యలు చేపట్టాలని సూచించింది. తొలుత భారత్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వేరియంట్‌ ఇప్పటి వరకు 132 దేశాలకు పాకింది.

మరిన్ని వేరియంట్లు తప్పవు..

ఇప్పటి వరకు నాలుగు ఆందోళనకర వేరియంట్లు వెలుగులోకి వచ్చాయని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్ అధనామ్‌ తెలిపారు. ఒకవేళ వైరస్‌ ఇలాగే రూపాంతరం చెందుతూ వెళితే.. మరిన్ని ప్రమాదకరమైన వేరియంట్లు ఉద్భవిస్తాయని హెచ్చరించారు. గత నాలుగు వారాల్లో సగటున 80 శాతం కేసులు పెరిగాయని వెల్లడించారు.

డెల్టాకూ అదే విరుగుడు..

డెల్టా ప్రమాదకర స్థాయిలో వ్యాపిస్తున్నప్పటికీ.. కరోనా కట్టడి నిబంధనలు మహమ్మారి వ్యాప్తిని అడ్డుకుంటున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర విభాగం డైరెక్టర్‌ మైకేల్‌ ర్యాన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో భౌతిక దూరం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం.. వంటి పనులను నిర్లక్ష్యం చేయొద్దని తెలిపారు. అలాగే వ్యాక్సినేషన్‌ సైతం సమర్థంగా పనిచేస్తోందన్నారు.

అసనమానతలే అతిపెద్ద ఆందోళన..

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ పంపిణీలో అసమానతల వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా నాలుగు బిలియన్ల డోసులు పంపిణీ చేశారు. వీటిలో ప్రపంచ బ్యాంకు గుర్తించిన ధనిక దేశాల్లో ప్రతి 100 మందిలో 98 డోసులు పంపిణీ అయినట్లు డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. ఆదాయపరంగా అట్టడుగున ఉన్న 29 దేశాల్లో మాత్రం ప్రతి 100 మందిలో 1.6 డోసులు మాత్రమే పంపిణీ చేసినట్లు తెలిపింది. ఒకవేళ ఈ 4 బిలయన్ల డోసుల్ని సమానంగా పంపిణీ చేసి ఉంటే.. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ ముప్పు ఎక్కువగా ఉన్న వృద్ధులందరికీ రెండు డోసులు అంది ఉండేవని తెలిపింది. అప్పుడు డెల్టా వేరియంట్‌ వల్ల పెద్దగా ముప్పు ఉండి ఉండేది కాదని అభిప్రాయపడింది.

మంత్రదండమేమీ లేదు..

ఈ సెప్టెంబరు కల్లా ప్రతి దేశం.. అక్కడి జనాభాలో 10 శాతం మందికి, ఈ ఏడాది చివరికి 40 శాతం మందికి, వచ్చే సంవత్సరం మధ్యనాటికి 70 శాతం మందికి టీకాలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించింది. కానీ, ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ సాగుతున్న తీరును బట్టి చూస్తే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం కాకపోవచ్చని టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు డబ్ల్యూహెచ్‌ఓ సభ్య దేశాల్లో కేవలం సగం మాత్రమే వాటి జనాభాలో 10 శాతం మందికి పూర్తిస్థాయి డోసులు అందించాయని తెలిపారు. బురుండి, ఎరిత్రియా, ఉత్తర కొరియాలో వ్యాక్సినేషన్‌ ఇంకా ప్రారంభం కావాల్సి ఉందని పేర్కొన్నారు. మహమ్మారిని అంతం చేయడానికి మంత్రదండమేదీ లేదని.. వ్యాక్సినేషన్‌ ఒక్కటే అందుకు మార్గమని ర్యాన్‌ స్పష్టం చేశారు. కానీ, ఆ వ్యాక్సిన్లను సమానంగా పంపిణీ చేయకుండా మనకు మనమే హానిచేసుకుంటున్నామని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని