కరోనా: పరిస్థితులు మరింత దిగజారనున్నాయి

ఐరోపా, ఉత్తర అమెరికాలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ ఆందోళన కలిగిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రజలను అప్రమత్తం చేసింది.

Published : 07 Jan 2021 14:09 IST

ఉత్పరివర్తనలకు తగ్గట్టుగా టీకాలో మార్పులు సాధ్యమే!

జెనీవా: ఐరోపా, ఉత్తర అమెరికాలో కరోనా వైరస్ విజృంభణ ఆందోళన కలిగిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రజలను అప్రమత్తం చేసింది. కరోనా టీకాలు వచ్చినప్పటికీ.. 2021లో మరో ఆరునెలల పాటు పరిస్థితులు కఠినంగానే ఉంటాయని హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్యసంస్థలో సాంకేతిక విభాగానికి నాయకత్వం వహిస్తోన్న మారియా వాన్ కెర్కోవా మాట్లాడుతూ.. పలు దేశాల్లో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. మున్ముందు పరిస్థితులు మరింత దిగజారనున్నాయన్నారు. 

‘చాలా దేశాల్లో తీవ్ర స్థాయిలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు, ఆసుపత్రుల్లో చేరిక, ఐసీయూల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు జనవరిలో మరిన్ని కేసులు పెరిగేందుకు కారణమవుతాయి. రానున్న వారాల్లో పరిస్థితులు మరింత దిగజారనున్నాయి’ అని మారియా ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇప్పటికే సంవత్సరం గడిచింది. ఇది సుదీర్ఘ యుద్ధం. మరో మూడు నుంచి ఆరు నెలలు అత్యంత కఠినమైనవి. కానీ, మనం పోరాడగలం. టీకాలు వస్తున్నాయి. అయితే, అందరికి అందుబాటులోకి రాలేదు’ అని ఆరోగ్య సంస్థ అత్యవసర కార్యక్రమాల విభాగాధిపతి మైఖేల్ ర్యాన్ అభిప్రాయపడ్డారు. 

టీకాలో మార్పులు సాధ్యమే..!

బ్రిటన్‌, దక్షిణాఫ్రికాలో ఉత్పరివర్తనలు పొందిన కరోనా వైరస్‌ను గుర్తించిన సంగతి తెలిసిందే. దీనికి వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, వ్యాధి తీవ్రతలో మాత్రం స్పష్టమైన మార్పులేదని మారియా అన్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన టీకాలు కొత్త స్ట్రెయిన్‌పై పనిచేయవనే సంకేతాలు ఏమీ లేవని ర్యాన్ వెల్లడించారు. అలాగే ఉత్పరివర్తనలకు తగ్గట్టుగా టీకాలు సర్దుబాటు చేయడం కూడా సరళంగానే ఉంటుందని అంచనా వేశారు. మాములుగా కొత్త రకం వైరస్‌కు వేగంగా వ్యాప్తి చెందే గుణం ఉన్నప్పటికీ, తీవ్రంగా మారే అవకాశం తక్కువని తెలిపారు. 

ఇవీ చదవండి:

కోటి మంది మహమ్మారిని జయించారు

బర్డ్‌ ఫ్లూ: మానవులకు సంక్రమిస్తుందా..?

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని