Wheat prices: దేశంలో గోధుమ పిండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్‌.. కారణాలివే!

దేశంలో ద్రవ్యోల్బణం పైకి ఎగబాకుతుండటంతో నిత్యావసరాల ధరలూ మండిపోతున్నాయి. దీంతో ఏం కొనాలన్నా.. ఏం తినాలన్నా సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు.........

Published : 10 May 2022 02:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దేశంలో నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం నిత్యావసర ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దీంతో ఏం కొనాలన్నా.. ఏం తినాలన్నా సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. నిత్యం ఇంట్లో వాడే గోధుమ పిండి ధరలు కూడా తాజాగా గరిష్ఠస్థాయికి చేరాయి. ఏప్రిల్‌లో కిలో గోధుమ పిండి నెలవారీ సగటు రిటైల్ ధర రూ.32.38గా ఉంది. ఇది గత 12 ఏళ్లలో అత్యధికం కావడం గమనార్హం. అసలు దేశంలో గోధుమ పిండి ధరలు పెరగడానికి కారణాలేంటి?

  • మన దేశంలో గోధుమల ఉత్పత్తి, నిల్వలు క్షీణించడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు.  ప్రస్తుతం ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం కొనసాగుతున్న వేళ గోధుముల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా గోధుమలకు కొరత ఏర్పడటంతో.. ఎగుమతులకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. 
  • గోధుమ ఉత్పత్తిలో రష్యా, ఉక్రెయిన్‌ ప్రధాన ఉత్పత్తిదారు దేశాలుగా ఉన్నాయి గోధుమ ఉత్పత్తిలో రష్యా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎగుమతిదారు కాగా.. ఉక్రెయిన్‌ నాలుగోది. ఉక్రెయిన్‌- రష్యా యుద్ధంతో ఏర్పడిన సంక్షోభం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గోధుముల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ పరిణామం ధరల పెరుగుదలకు దారితీసింది. 
  • గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 70లక్షల మెట్రిక్‌ టన్నుల గోధుమలను ఎగుమతి చేసింది. ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా గోధుమల కొరత సృష్టించడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది.
  • ఈసారి మన దేశంలో వేసవి ముందుగానే రావడం కూడా గోధుమ ఎగమతులు తగ్గడానికి ప్రధాన కారణం. 2020-21లో గోధుమల ఉత్పత్తి అంచనా 109.59 మిలియన్ టన్నులు కాగా.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అధికంగా 110 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది. అయితే, మార్చిలో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆ లక్ష్యాలు నీరుగారిపోయాయి. 
  • గోధుమ పిండి ధరలతో పాటు బేకరీ బ్రెడ్‌ ధరలూ కొన్ని నెలలుగా పెరుగుతున్నాయి. దీనికి తోడు దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న డీజిల్‌ ఛార్జీలతో లాజిస్టిక్స్‌ భారమై గోధుమ, గోధుమ పిండి ధరల పెరుగుదలకు మరో కారణంగా పేర్కొంటున్నారు.

మరోవైపు, కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వశాఖకు రాష్ట్ర పౌరసరఫరా శాఖలు అందించిన సమాచారం ప్రకారం.. మే 7న మన దేశంలో గోధుమ పిండి కిలో సగటు రిటైల్‌ ధర రూ.32.78గా ఉన్నట్టు పేర్కొన్నాయి. గతేడాది కిలో గోధుమ పిండి ధర రూ.30.03గా ఉండగా.. ఇప్పుడు  దాదాపు 9.15శాతం పెరగడం గమనార్హం. దేశంలోని 156 కేంద్రాలకు సంబంధించిన అందుబాటులో ఉన్న డేటాను బట్టి శనివారం పోర్ట్‌ బ్లెయిర్‌లో అత్యధికంగా కిలో గోధుమ పిండి ధర రూ.59లు ఉండగా.. బెంగాల్‌లోని పురూలియాలో అత్యల్పంగా కిలో ధర రూ.22గా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని