Delhi Highcourt: మద్యం పాలసీ మంచిదైతే.. ఎందుకు వెనక్కి తీసుకున్నట్లు?

దిల్లీ ప్రభుత్వం (Delhi Govt) తీసుకొచ్చిన మద్యం పాలసీ (Liquor Scam) మంచిదే అయినప్పుడు.. మళ్లీ ఎందుకు వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని దిల్లీ హైకోర్టు మనీశ్‌ సిసోదియాను ప్రశ్నించింది. దీనికి సూటిగా సమాధానం తెలుకొని రావాలని ఆయన తరఫు న్యాయవాదిని కోరింది.

Published : 01 Jun 2023 22:07 IST

దిల్లీ: దిల్లీ (Delhi) ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ (Liquor Policy) మంచిదే అయినప్పుడు తిరిగి దానిని ఎందుకు వెనక్కితీసుకోవాల్సి వచ్చిందని మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోదియాను (Manish Sisodia) దిల్లీ హైకోర్టు (Delhi Highcourt) ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు సరైన వివరణతో రావాలని ఆయన తరఫు న్యాయవాదిని కోరింది. మద్యం పాలసీ విధానంలో సిసోదియాతోపాటు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సహ నిందితుడు విజయ్ నాయర్‌ల మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై జస్టిస్‌ దినేశ్‌ శర్మ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కుంభకోణం జరిగిన సమయంలో సిసోదియా డిప్యూటీ సీఎంతోపాటు ఎక్సైజ్‌శాఖ బాధ్యతలు కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. ‘‘మీరు తీసుకొచ్చిన విధానం మంచిదే అయినప్పుడు మళ్లీ దానిని వెనక్కి ఎందుకు తీసుకున్నారు? దీనికి సూటిగా సమాధానం చెప్పండి’’ అంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. 

గతంలోనూ న్యాయస్థానం ఇదే ప్రశ్న సంధించగా..నాన్‌ కన్ఫర్మింగ్‌ జోన్లలో మద్యం విక్రయాల కోసం దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనుమతించకపోవడంతో మద్యం పాలసీ విధానాన్ని వెనక్కి తీసుకున్నట్లు సిసోదియా తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అందుకే ఇలాంటి ప్రాంతాల్లో గతంలో పదేళ్లపాటు అమల్లో ఉన్న పాలసీ ప్రకారం మద్యం విక్రయాలకు అనుమతించినట్లు చెప్పారు.  నూతన ఎక్సైజ్‌ పాలసీ ప్రకారం.. ప్రతి లైసెన్సుదారు మున్సిపల్‌ వార్డు పరిధిలో మూడు దుకాణాలను తెరవాల్సి ఉంది. అయితే, మాస్టర్‌ప్లాన్‌ను ఉల్లంఘించినట్లు దిల్లీ స్థానిక సంస్థల నుంచి వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో దుకాణాలను తెరవలేకపోయినట్లు సిసోదియా తరఫు న్యాయవాదులు వివరణ ఇచ్చారు.

సీబీఐ, ఈడీ కేసుల్లో గతంలో దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను ఉపసంహరించుకునేందుకు న్యాయస్థానం సిసోదియాకు మే 24న అనుమతిచ్చింది. అయితే, వెనక్కి తీసుకోకపోవడంతో.. మే 30న విచారణ చేపట్టిన న్యాయస్థానం.. మద్యం పాలసీ కుంభకోణంలో సిసోదియా ప్రభావవంతమైన వ్యక్తి అనీ, అతడిపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని పేర్కొంటూ బెయిల్‌ పిటిషన్లను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సిసోదియా, విజయ్‌ మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఎక్సైజ్‌ పాలసీని సవరించేటప్పుడు సిసోదియా అక్రమాలకు పాల్పడ్డారనేది సీబీఐ, ఈడీల వాదన. లైసెన్స్‌దారులకు అవసరమైన సాయం చేసి, ప్రతిఫలంగా కొంత మొత్తాన్ని పొందినట్లు దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. దిల్లీ ప్రభుత్వం 2021 నవంబర్‌ 17న మద్యం పాలసీని తీసుకొచ్చి.. 2022 సెప్టెంబరు చివరి నాటికి దానిని వెనక్కి తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని