Kejriwal: చైనాతో వాణిజ్యంపై కేంద్రానికి కేజ్రీవాల్‌ ప్రశ్న!

భారత్‌ పట్ల దుందుడుకుతనంతో వ్యవహరిస్తున్న చైనా(China)కు గట్టి గుణపాఠం నేర్పాలని ఆప్‌ అధినేత, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌(Kejriwal) అన్నారు. డ్రాగన్‌తో మనం వాణిజ్యాన్ని ఎందుకు మానుకోకూడదు అని ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేశారు. 

Published : 15 Dec 2022 02:21 IST

దిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌ (Arunachal pradesh)లోని తవాంగ్‌ సెక్టార్‌(Tawang sector)లోని యాంగ్ట్సే వద్ద ఇటీవల భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాతో భారత్‌ ఎందుకు వాణిజ్యం మానుకోవడంలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్విట్‌ చేశారు. చైనాతో మనం వాణిజ్యాన్ని ఎందుకు మానుకోవడంలేదు? చైనా నుంచి దిగుమతి అయ్యే చాలా వస్తువులు భారతదేశంలోనే తయారవుతున్నాయి కదా అని పేర్కొన్నారు. చైనాతో వాణిజ్యాన్ని నిలిపివేయడం ద్వారా దుందుడుకుతనంతో మనపైకి వస్తున్న ఆ దేశానికి గుణపాఠం చెప్పడంతో పాటు మన దేశంలో ఉపాధికల్పన కూడా జరుగుతుందన్నారు.  డిసెంబర్‌ 9న తవాంగ్‌లో వాస్తవాధీన రేఖ వద్ద చైనాతో చెలరేగిన ఘర్షణలో మన దేశానికి చెందిన ఆరుగురు సైనికులు గాయపడినట్టు వార్తలపై ఇటీవల స్పందించిన కేజ్రీవాల్‌.. చైనా దూకుడును అడ్డుకున్న మన జవాన్లు దేశానికే గర్వకారణమన్నారు. వారి ధైర్యసాహసాలకు వందనాలు తెలిపారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ట్వీట్‌ చేశారు. 

చైనా సేనల దూకుడుపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. ఈ ఘటనపై నిన్న ఉదయం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. మన దేశ భూభాగంలోకి చొచ్చుకొని వచ్చేందుకు ప్రయత్నించిన చైనా సేనల్ని భారత్‌ సైన్యం దీటుగా తిప్పికొట్టిందన్నారు. జూన్‌ 2020లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత్- చైనా బలగాలు తీవ్రస్థాయిలో ఘర్షణపడ్డ తర్వాత ఇరుదేశాల మధ్య మరోసారి ఉద్రక్త వాతావరణం నెలకొనడం ఇదే తొలిసారి. అప్పటి ఘటనలో తెలంగాణకు చెందిన కల్నల్‌ సంతోష్‌బాబు సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన ఘటన యావత్‌ దేశాన్ని కలిచివేసింది. ఆ తర్వాత వివిధ దశల్లో కమాండర్‌ స్థాయి చర్చలు జరిగిన తర్వాత యథాతథ స్థితిని కొనసాగించాలన్న నిబంధనపై ఇరు దేశాలూ తమ బలగాలను వెనక్కి తీసుకున్నప్పటికీ తాజాగా తవాంగ్‌ సెక్టార్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేజ్రీవాల్‌ ఆ దేశంతో వాణిజ్యాన్ని నిలిపివేయడం ద్వారా డ్రాగన్‌కు గట్టి బుద్ధి చెప్పొచ్చని అభిప్రాయపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని