
రాముడి భూమిపై పెట్రోల్ ధరలు తగ్గేదెన్నడు?
దిల్లీ: దేశంలోని పెట్రోల్, డీజిల్ ధరల అంశంపై బుధవారం పార్లమెంటులో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఇంధన ధరలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు రామాయణ ఇతిహాసాన్ని చర్చలో ప్రస్తావించారు. మనదేశంలోని పెట్రోల్ ధరలకు, పొరుగున ఉన్న సీతాదేవి జన్మస్థలం నేపాల్, రావణుడి శ్రీలంకలోని ధరలకు వ్యత్యాసాన్ని పోల్చుతూ ప్రభుత్వానికి ప్రశ్నలు వేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
సమాజ్‌వాదీ పార్టీకి చెందిన విశంభర్ ప్రసాద్ నిషాద్ రాజ్యసభలో మాట్లాడుతూ.. ‘పెట్రోల్, డీజిల్ ధరలు మనదేశంతో పోలిస్తే.. సీతాదేవి జన్మస్థలం నేపాల్‌లో, రావణుడి లంకలో ఎందుకు తక్కువగా ఉన్నాయి. మరి రాముడి భూమిపై ప్రభుత్వం ఎప్పుడు పెట్రోల్ ధరలు తగ్గిస్తుంది’ అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈయన ప్రశ్నించిన తీరు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఆయన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బదులిస్తూ.. ఏదైనా అంశాన్ని ఇలా ఇతరులతో పోల్చడం సరికాదని సూచించారు. ఆయా దేశాల్లో పెట్రోల్, డీజిల్ తక్కువ మంది ఉపయోగిస్తారు.. కాబట్టి వినియోగానికి అనుగుణంగానే ఆయా దేశాల్లో వాటి ధరలు తక్కువగానే ఉంటాయన్నారు. అయినా మనల్ని మనం పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోల్చుకోవాలా.. లేక చిన్న వాటితోనా? అని ఎదురు ప్రశ్న వేశారు. పెట్రోల్, డీజిల్ ధరల నిర్ణయం అంతర్జాతీయ మెకానిజంపై ఆధారపడి ఉంటుందని బదులిచ్చారు. ‘మనదేశంలో కిరోసిన్ ధరలను ఇతర దేశాలతో పోల్చితే చాలా వ్యత్యాసం ఉంటుంది. బంగ్లాదేశ్, నేపాల్‌లో కిరోసిన్ రూ.57 లేదా రూ.59 ఉంటుంది. మరి భారత్‌లో కిరోసిన్ ధర రూ.32 మాత్రమే’ అని ప్రధాన్ ఉదహరించారు.
కాగా దేశంలో ఇంధన ధరలు బుధవారం మరోసారి పెరిగిన విషయం తెలిసిందే. వరుసగా రెండోరోజు చమురు ధరలు పెరిగి కొత్త గరిష్ఠాలను తాకడంతో.. పెట్రోల్‌పై 30పైసలు, డీజిల్‌పై 25పైసలు పెరిగింది. దీంతో దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.87.60కి చేరింది. డీజిల్ ధర రూ.77.73గా ఉంది.
ఇదీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.