గూగుల్‌పై వెనక్కి తగ్గేదే లే!: కర్ణాటక

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ ఉన్న సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌  కర్ణాటక ప్రజల ఆగ్రహాన్ని చవి చూసింది. భారతీయ భాషల్లో అందవికారమైన భాషకు సమాధానంగా కన్నడ భాషను చూపడంతో కన్నడిగులు...

Published : 05 Jun 2021 20:55 IST

కన్నడ భాషను అవహేళన చేయడంపై తీవ్ర ఆగ్రహం

బెంగళూరు: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ ఉన్న సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌.. కన్నడ ప్రజల ఆగ్రహాన్ని చవి చూసింది. భారతీయ భాషల్లో అందవికారమైన భాషకు సమాధానంగా కన్నడ భాషను చూపడంతో కన్నడిగులు గురువారం భారీ ఆందోళనకు తెరతీశారు. వెంటనే తప్పు తెలుసుకొని గూగుల్‌ క్షమాపణలు చెప్పినప్పటికీ వెనక్కి తగ్గేదే లేదంటూ కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. టెక్‌ దిగ్గజానికి లీగల్‌ నోటీసులు పంపేందుకు సిద్ధమైంది. 

గూగుల్‌ తప్పిదంపై పలువురు కర్ణాటక రాజకీయ ప్రముఖులు, భాషాభిమానులు తీవ్రంగా స్పందించారు. గూగుల్‌పై న్యాయపరంగా పోరాడతామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల వేదికగా గూగుల్‌పై విమర్శలు గుప్పించారు. కన్నడ భాషకు 2500 ఏళ్ల చరిత్ర ఉందని, తరతరాలుగా కన్నడిగులు తమ మాతృభాషను గర్వకారణంగా భావిస్తున్నారని కర్ణాటక అటవీ, సాంస్కృతిక శాఖ మంత్రి అరవింద్‌ లింబవల్లి పేర్కొన్నారు. కన్నడ భాషను తక్కువ చేసి చూపడం కర్ణాటక ప్రజలను అవమానించడమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయంపై గూగుల్‌ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. సెర్చ్‌ ఇంజిన్‌ అన్ని వేళలా కచ్చితంగా ఉండదని వెల్లడించారు. కొన్నిసార్లు అది పలు ప్రశ్నలకు విచిత్రమైన సమాధానాలు చూపడం సాధారణమే అన్నారు. అయితే ఇలాంటి సమాధానాలు ఆమోదయోగ్యమైనవి కాదన్నారు. సాధారణంగా అలాంటి సమాధానాలు గూగుల్‌ అభిప్రాయాలు కావని తెలిపారు. తమ వల్ల ఎవరి మనోభావాలకు భంగం వాటిల్లినా క్షమించాలని కోరారు. తాజా ఘటనపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి వరుస ట్వీట్లతో గూగుల్‌పై విరుచుకుపడ్డారు. ఇంత బాధ్యతా రాహిత్యంగా ఎలా పనిచేస్తున్నారంటూ ప్రశ్నించారు.

ఎందుకిలా జరుగుతుంది..?

గూగుల్‌ మనకు కావాల్సిన సమాచారాన్ని ప్రత్యేక అల్గారిథమ్‌ ద్వారా మనముందుకు తెస్తుంది. గూగుల్‌ సెర్చ్‌ బాక్స్‌లో టైప్‌ చేసిన కీవర్డ్స్‌ ఆధారంగా, అంతర్జాలంలో అందుబాటులో ఉండే సమాచారం మేరకు ఫలితాలు కనిపిస్తాయి. యూజర్‌ ఏదైనా ప్రశ్నను టైప్‌ చేసినప్పుడు అందులోని పదాల ఆధారంగా వివిధ వెబ్‌సైట్లతోపాటు ఆయా పదాలతో ఇంకేమైనా సమాచారముంటే దానంతటినీ క్రోడీకరించి, సరైనదే అని నిర్ధారించుకున్నాక గూగుల్‌ తన యూజర్‌కు చూపిస్తుంది. దీనినే సెర్చింజన్‌ ఆప్టిమైజేషన్‌ (ఎస్‌ఈవో) అంటారు. అందువల్ల ఇలాంటి పదాలతో ఎవరైనా సమాచారాన్ని వెబ్‌సైట్లలోగానీ, బ్లాగ్స్‌లోగానీ పోస్టు చేస్తే కొన్ని సార్లు ఇలాంటి ఫలితాలే వస్తాయని, ప్రస్తుతం కన్నడ భాష విషయంలోనూ ఇదే జరిగిందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విషయంలోనూ ఇలాగే జరిగిందని అంటున్నారు. సెర్చ్‌ బాక్స్‌లో ‘Idiot’ అని టైప్‌ చేస్తే ట్రంప్‌ ఫోటో ప్రత్యక్షమవ్వడం 2018 డిసెంబర్‌లో తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అసలు ఎస్‌ఈవో ఎలా పని చేస్తుందో హౌస్‌ జ్యూడీషియరీ కమిటీ విచారణలో యూఎస్‌ కాంగ్రెస్‌ మహిళ జోయ్‌ లాఫ్‌గ్రెన్‌కి సుందర్‌ పిచాయ్‌ అప్పట్లో వివరించారు. సెర్చ్‌ రిజల్ట్స్‌పై సంస్థ నియంత్రణ ఎందుకు తక్కువగా ఉంటుందో చెప్పారు. గూగుల్‌లో ఫలితాలన్నీ సెర్చ్‌ ఇండెక్స్‌, వెబ్‌పేజెస్‌, కీ వర్డ్స్‌, ఆయా వెబ్‌పేజీల్లో ఉన్న ఫొటోల ఆధారంగానే ఉంటాయని వివరించారు. ఈ నేపథ్యంలో కన్నడిగులు మరింత ముందుకెళ్తే ఏం జరుగుతుందో చూడాలి మరి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని