ఆ పాత గాయాలను మరిచారా..?

న్యూజిలాండ్‌లో కొవిడ్‌ తొలిసారి అడుగుపెట్టినప్పుడు అక్కడి ప్రధాని ప్రజలకు దాదాపు రెండు రోజులకు పైగా సమయం ఇచ్చి ఒత్తిడి లేకుండా నిత్యావసరాల కొనుగోలు.. ఇతర ప్రాంతాల వారు ఇళ్లకు చేరుకోవడానికి అవకాశం కల్పించారు.

Updated : 20 Apr 2021 12:37 IST

పేదోడికి మరో మహాపాదయాత్ర తప్పదా..!

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

న్యూజిలాండ్‌లో కొవిడ్‌ తొలిసారి అడుగుపెట్టినప్పుడు అక్కడి ప్రధాని ప్రజలకు దాదాపు రెండు రోజులకు పైగా సమయం ఇచ్చి ఒత్తిడి లేకుండా నిత్యావసరాల కొనుగోలు.. ఇతర ప్రాంతాల వారు ఇళ్లకు చేరుకోవడానికి అవకాశం కల్పించారు. ఫలితంగా అక్కడ  వైరస్‌ వేగంగా అదుపులోకి వచ్చింది. జసిండా ఆర్డెన్‌ అనుసరించిన మంచి వ్యూహంగా ప్రపంచ వ్యాప్తంగా ఇది ప్రశంసలు అందుకొంది.

కరోనా తొలి తరంగం వచ్చిన సమయంలో భారత్‌లో హఠాత్తుగా లాక్‌డౌన్‌ పెట్టడంతో కొన్ని రోజులు భరించిన వలస కూలీలు చివరికి పొట్టచేతపట్టుకొని స్వగ్రామాలకు వెళ్లారు. ఈ క్రమంలో తినడానికి కూడా ఏమీ దొరకని పరిస్థితుల్లో.. ఎర్రటి ఎండలో పసిబిడ్డలను నడిపించుకొంటూ స్వగ్రామాల దిశగా మహాపాదయత్ర చేయాల్సి వచ్చింది. మార్గమధ్యలో దాతలు ఎవరైనా దయతలిస్తే కడుపునింపుకోవాల్సి వచ్చింది.  కొంత మంది దారిలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూశాము. దీని నుంచి పాఠాలు నేర్చుకొన్నట్లు ప్రభుత్వాలు కనపించడంలేదు. మళ్లీ అదే షాక్‌..! దిల్లీలో హఠాత్తుగా వారం రోజులు లాక్‌డౌన్‌ విధించడంతో చాల మంది చిరు ఉద్యోగులు.. కూలీలు  స్వగ్రామాలకు చేరేందుకు రైల్వేస్టేషన్లు.. బస్టాండ్లకు పరుగులు తీస్తున్నారు. అక్కడి ప్రభుత్వం మాత్రం కేవలం ఇది చిన్న లాక్‌డౌన్‌ అని.. భవిష్యత్తును ఊహించి హామీ ఇస్తోంది.  అదేదో రెండుమూడ్రోజుల ముందే లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు చెబితే ఈ పరిస్థితి ఉండేది కాదుగా.

రెట్టింపు ఛార్జీలు చెల్లించి..

లాక్‌డౌన్‌ ప్రకటించిన గంటల్లోనే భారీ సంఖ్యలో  ప్రజలు స్వగ్రామాలకు వెళ్లేందుకు ఆనంద్‌ విహార్‌ ఐఎస్‌బీటీకు వచ్చారు. దీంతో అక్కడ జనాలను అదుపు చేసేందుకు పోలీసులను నియమించాల్సి వచ్చింది. ఇలాంటివి కరోనా సూపర్‌ స్ప్రెడ్‌ ఘటనలు అయ్యే ముప్పు పొంచి ఉంది. అక్కడి నుంచి గ్రామాలకు వైరస్‌ పాకవచ్చు. మరోవైపు లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 26 తర్వాత కూడా పొడిగిస్తారని చాలా మంది భయపడుతన్నారు. వీరిలో పలువురు 2020 లాక్‌డౌన్‌ చేదు అనుభవాలను ఇంకా మర్చిపోలేదు. ‘‘గతంలో లాక్‌డౌన్‌‌ను ఇలానే క్రమంగా పెంచుకుంటూ వెళ్లారు. అప్పట్లో తినడానికి తిండికూడా లేదు. మళ్లీ అలాంటి స్థితిలోకి వెళ్లేందుకు సిద్ధంగా లేను’’ అని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన సలాభ్‌కుమార్‌ అనే కార్మికుడు ‘ది హిందూ’ పత్రికకు వెల్లడించారు.

మరోపక్క ప్రభుత్వ బస్సులు కిక్కిరిసి పోవడంతో ప్రైవేటు బస్‌ ఆపరేటర్లు కార్మికుల భయాన్ని సొమ్ముచేసుకుంటూ ఇష్టారాజ్యంగా ఛార్జీలు వసులు చేస్తున్నారు.  సీట్‌ కావాలంటే రెట్టింపు ఛార్జీ.. అదే బస్‌టాప్‌పై ఎక్కితే సగం ఛార్జీ వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులొచ్చాయి.

ఇది స్వల్పకాల లాక్‌డౌనే: దిల్లీ ప్రభుత్వం

ఇది స్వల్పకాల లాక్‌డౌన్‌ మాత్రమే అయ్యే అవకాశం ఉందని దిల్లీ ప్రభుత్వం బలంగా చెబుతోంది. దీనిపై ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటన చేస్తూ..‘‘నేను చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. ఇది కేవలం ఆరు రోజుల స్వల్పకాల లాక్‌డౌన్‌‌. దిల్లీని వీడి వెళ్లవద్దు. దీనిని భవిష్యత్తులో పొడిగించాల్సిన అవసరం రాదని బలంగా నమ్ముతున్నాను. ప్రభుత్వం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది ’’ అని వలస కూలీల్లో విశ్వాసం పెంపొందించే ప్రయత్నం చేశారు. కానీ, చాలా మంది కార్మికులు మాత్రం కరోనా వ్యాప్తి వేగాన్ని చూసి భయంతో దిల్లీని వీడుతున్నారు. మరోపక్క ఉత్తర్‌ ప్రదేశ్‌లోని 5 నగరాల్లో రాష్ట్ర హైకోర్టు లాక్‌డౌన్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇదే పరిస్థితి దేశంలో మరికొన్ని చోట్ల తలెత్తవచ్చు.

ఆక్సిజన్‌ అవసరం ఇప్పుడే తెలిసిందా..?

కరోనా ముఖ్యంగా ఊపిరితిత్తులను దెబ్బతీసే వైరస్‌. ఈ క్రమంలో ఆక్సిజన్‌ అవసరం వస్తుందని ప్రభుత్వాలు గుర్తించలేదా..? కరోనావైరస్‌ తొలి తరంగం వచ్చిన సమయంలో ఆక్సిజన్‌ సరఫరా వృద్ధికి చర్యలు తీసుకొంటే ప్రస్తుత పరిస్థితి ఉండదు. ప్రభుత్వాల ఉదాసీనతకు మంచి ఉదాహరణ లఖ్‌నవూలోని పీజీఐ ఆసుపత్రిలోని ఆక్సిజన్‌ ప్లాంట్‌. అక్కడ ఇటీవలే ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ప్రారంభించినట్లు వార్తలు, ఫొటోలు వచ్చాయి. వాస్తవానికి అక్కడ ఆ ప్లాంట్‌ ఎప్పటి నుంచో ఉంది. దానిని అప్‌గ్రేడ్‌ చేసే పనులపై 2017లోనే పత్రికల్లో వార్తలొచ్చాయి. దానిని కొవిడ్‌ కేసులు తీవ్రం అయ్యే వరకు ప్రారంభించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

దాదాపు 162 ఆసుపత్రుల్లో పీఎస్‌ఏ టెక్నాలజీతో ఆక్సిజన్‌ ప్లాంట్లను గతేడాది ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ, ఏప్రిల్‌ 18 నాటికి కేవలం 33 మాత్రమే ఏర్పాటు చేయగలిగారు. ఏప్రిల్‌ చివరి నాటికి 59, మే చివరి నాటికి 80 ప్లాంట్లను ఇన్‌స్టాల్‌ చేస్తామని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ట్విటర్‌లో పేర్కొంది. ఈ ప్రాజెక్టు  విలువ దాదాపు రూ.200 కోట్లు. కేంద్ర ప్రభుత్వ బృహత్‌ ప్రాజెక్టులతో పోలిస్తే ఇది చాలా చిన్నమొత్తమే. కానీ, రోగులకు సంజీవని వంటిది. ఇది కూడా ఇప్పటి వరకు పూర్తికాకపోవడం గమనార్హం. ప్రభుత్వ రంగ పరిశ్రమలు, పారిశ్రామిక వేత్తలు ఆక్సిజన్‌ డిమాండ్‌ను పూర్తి చేసేందుకు ముందురావడం కొంతలో కొంత ఊరటగా నిలిచింది. పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజన్‌ వినియోగంలో కోత విధించింది.

బ్లాక్‌మార్కెట్‌పై నిఘా ఏదీ..

వారణాసి భాజపా మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు హాజీ అన్వర్‌ అహ్మద్‌ వదినకు కరోనా సోకింది. కొవిడ్‌ కేంద్రంలో బెడ్‌ కోసం అతను జిల్లా మేజిస్ట్రేట్‌తో పాటు పలువురు పెద్దలను వేడుకొన్నాడు. కానీ, బెడ్‌ దొరకలేదు.. దీంతో ఆమె కన్నుమూసింది. తోటి నాయకుల కుటుంబసభ్యులు చాలా మంది ఇలాంటి సమస్యలను చవిచూశారని అన్వర్‌ పేర్కొన్నాడు.  అధికారపార్టీ నాయకుల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఊహించుకోవచ్చు. గతంలో కొవిడ్‌ సమయంలో సేవలు అందించినందుకు అహ్మద్‌ను ప్రధాని స్వయంగా అభినందించారు.

బాధితులను కరోనా మహమ్మారి కంటే బ్లాక్‌మార్కెట్లు భయపెడుతున్నాయి. కరోనా తొలి విడతలో ఆసుపత్రి బెడ్లను ఇప్పించేందుకు బ్రోకర్లు పుట్టుకొచ్చిన సంగతి కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు. కానీ, రెండో తరంగం సమయానికి మళ్లీ అవే పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. ఇక రెమిడెసివిర్‌ పరిస్థితి మరీ ఘోరం. వాస్తవ ధరకు కొన్ని రెట్లు అధికంగా విక్రయిస్తున్నారు. ఇక కొన్ని రాష్ట్రాల్లో వీటి చుట్టూ  రాజకీయాలు మొదలయ్యాయి. మహారాష్ట్రలో దాదాపు 60వేల వయల్స్‌ను పక్కదారి  పట్టించేందుకు యత్నించినట్లు వార్తలొచ్చాయి. తాజాగా హైదరాబాద్‌లో కూడా ఓ ఘటన చోటు చేసుకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని