Hijab Row: అందుకే రాజీనామా చేస్తున్నా.. వైరల్‌గా మారిన లెక్చరర్‌ లేఖ!

హిజాబ్‌ ధరించి వచ్చిన ఓ లెక్చరర్‌ను ఆ వస్త్రాన్ని తొలగిస్తేనే కాలేజీలోకి అనుమతిస్తామని ప్రిన్సిపల్‌ ఖరాఖండిగా చెప్పడంతో ఆమె తీవ్రంగా కలత చెందారు. దీంతో తన పదవికి రాజీనామా చేశారు.......

Published : 18 Feb 2022 21:16 IST

బెంగళూరు: కర్ణాటకలో చెలరేగిన హిజాబ్‌ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అల్లర్లు చెలరేగడంతో స్కూళ్లు, కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించి ఈ మధ్యే తిరిగి ప్రారంభించింది. అయితే హిజాబ్‌ వివాదంపై ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతున్న కారణంగా.. తీర్పు వెలువడే వరకూ విద్యార్థులు మతపరమైన దుస్తులు ధరించకూడదని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే హిజాబ్‌ ధరించి వచ్చిన విద్యార్థులతో పాటు టీచర్లు, లెక్చరర్లను కూడా యాజమాన్యాలు అడ్డుకుంటున్నాయి. వాటిని తొలగిస్తేనే స్కూళ్లు, కళాశాలల్లోకి అనుమతిస్తున్నాయి.

హిజాబ్‌ ధరించి వచ్చిన ఓ లెక్చరర్‌ను ఆ వస్త్రాన్ని తొలగిస్తేనే కాలేజీలోకి అనుమతిస్తామని ప్రిన్సిపల్‌ చెప్పడంతో ఆమె తీవ్రంగా కలత చెందారు. దీంతో తన పదవికి రాజీనామా చేశారు. తుమకూరులోని పీయూ కాలేజీలో ఇంగ్లీష్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్న చాందినీని హిజాబ్‌ తొలగించాలని ఆదేశించడంతో తన రాజీనామా లేఖను ప్రిన్సిపల్‌కు సమర్పించారు. ‘గౌరవనీయులైన ప్రిన్సిపల్ గారికి, నేను చాందిని.. ఇంగ్లీష్‌ డిపార్ట్‌మెంట్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్నా. నేను గత మూడేళ్లుగా ధరిస్తున్న హిజాబ్‌ను తొలగించాలని మీరు ఆదేశించారు. మతాన్ని పాటించడం రాజ్యాంగ హక్కు, దీనిని ఎవరూ కాదనలేరు. మీ అప్రజాస్వామిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా. ధన్యవాదాలు’ అంటూ లేఖను సమర్పించారు. ప్రస్తుతం ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

అనంతరం చాందిని మీడియాతో మాట్లాడుతూ.. ‘పీయూ కళాశాలలో గత మూడేళ్లుగా పనిచేస్తున్నా. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. హిజాబ్‌ లేదా ఇతర మతపరమైన వస్త్రాలను కాలేజీలో ధరించకూడదని నిన్న ప్రిన్సిపల్‌ సూచించారు. కానీ గత మూడేళ్లుగా హిజాబ్‌ ధరించే బోధిస్తున్నా. తాజా నిర్ణయం నా ఆత్మగౌరవానికి పరీక్షగా నిలిచింది. అందుకే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా’ అని చాందిని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని