Rahul Gandhi: మీ బంధం బయటపడినా.. మళ్లీ వారి డబ్బు అదానీకేనా? మోదీకి రాహుల్‌ ప్రశ్న

అదానీ వ్యవహారం (Adani Group)పై దర్యాప్తు చేపట్టేందుకు ఎందుకు అంత భయపడుతున్నారని ప్రధాని మోదీని రాహుల్‌ ప్రశ్నించారు. దీనిపై సమాధానం ఎందుకు చెప్పట్లేదని నిలదీశారు.

Published : 27 Mar 2023 20:48 IST

దిల్లీ: అదానీ (Adani Group) వ్యవహారంలో గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi).. తాజాగా మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM modi)పై తీవ్ర విమర్శలు చేశారు. అదానీ గ్రూప్‌పై ఎన్ని ఆరోపణలు వస్తున్నా.. వాటిపై దర్యాప్తు చేయడానికి ఎందుకు భయపడుతున్నారంటూ ప్రధానిని ప్రశ్నించారు.

‘‘ఎల్‌ఐసీ మూలధనం.. అదానీకే! ఎస్‌బీఐ డబ్బు.. అదానీకే! ఈపీఎఫ్‌ఓ సొమ్ములు.. అదానీకే! ‘మోదానీ (మెదీ-అదానీల బంధం అని ఉద్దేశిస్తూ) వ్యవహారం బయటపడిన తర్వాత కూడా ప్రజల రిటైర్మెంట్‌ డబ్బులను ఎందుకు అదానీ కంపెనీల్లో (Adani Group) పెట్టుబడిగా పెట్టారు? ఆ కంపెనీపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు లేదు.. ప్రధాని నుంచి సమాధానమూ లేదు..! ఎందుకంత భయపడుతున్నారు?’’ అని రాహుల్‌ (Rahul Gandhi) ట్విటర్‌ వేదిగాక మోదీ సర్కారును దుయ్యబట్టారు.

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ (Hindenburg Research) ఇచ్చిన నివేదిక ఇటీవల దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ నివేదిక తర్వాత అదానీ షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో ఆ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన ప్రభుత్వ రంగ సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో ఇది కాస్తా రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీనిపై పార్లమెంట్‌లో చర్చకు విపక్షాలు పట్టుబడుతుండటంతో ఉభయ సభల కార్యకలాపాలు స్తంభిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. అదానీ వ్యవహారంపై ప్రశ్నించినందుకే తనపై కుట్రపూరితంగా అనర్హత వేటు వేశారని ఇటీవల రాహుల్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని