Afghanistan: కరవు.. కరోనా.. పోలియో.. ఆపై తాలిబన్లు..!

అఫ్గాన్‌ జాతీయుల పరిస్థతి అత్యంత దయనీయంగా మారిపోయింది. ఇప్పటికే  ఆ దేశంలో మూడోంతుల ప్రాంతం తీవ్రమైన కరవుతో ఇబ్బంది పడుతోంది. దీనికి తోడు కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటం..

Published : 19 Aug 2021 18:21 IST

* దయనీయంగా మారిన అఫ్గానిస్థాన్‌ వాసుల జీవితాలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

అఫ్గాన్‌ జాతీయుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. ఇప్పటికే  ఆ దేశంలో మూడువంతుల ప్రాంతం తీవ్రమైన కరవుతో ఇబ్బంది పడుతోంది. దీనికి తోడు కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటం.. వ్యాక్సిన్ల లభ్యత తగ్గిపోవడంతో ప్రజల ప్రాణాలు ప్రమాదం అంచునకు చేరాయి. తాజాగా పాలనా పగ్గాలు తాలిబన్లు చేపట్టడంతో వారి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లైంది. వారు ఇప్పటికే పోలియో టీకాలను వ్యతిరేకిస్తున్నారు. ఇక కరోనా టీకాలను కూడా దేశంలోకి రానీయరనే భయాలు ఉన్నాయి. 

దేశం మొత్తం కరవు కోరల్లో..

అఫ్గానిస్థాన్‌లో కరవు నెలకొన్నట్లు జూన్‌ 22వ తేదీన అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ ప్రకటించారు. ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రెడ్‌క్రాస్‌ అండ్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీస్‌ ప్రకారం దేశంలో 30శాతం భూభాగంలో అత్యంత తీవ్రమైన కరవు నెలకొంది. 50శాతం తీవ్రమైన కరవు ఉండగా.. మరో 20శాతం భూభాగంలో ఓ మోస్తరు కరవు నెలకొంది. దేశంలోని గోధుమల ఉత్పత్తి రెండు మిలియన్‌ టన్నులకు పడిపోగా.. మూడు మిలియన్ల పశువులు, ఇతర జీవాలు మృత్యువు ముంగిట నిలిచాయి.  

 యూఎస్‌ ఎయిడ్‌ ఏప్రిల్‌2020లో ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రజలకు ఆహారం లభించని పరిస్థితి నెలకొంది. అఫ్గాన్‌ జనాభాలో సగం మంది కటిక పేదరికంలో ఉన్నారని  పేర్కొంది. వీరిలో 11 మిలియన్ల మందికి ఆహారం కూడా అందడంలేదని వెల్లడించింది. గతేడాది న్యూట్రిషియన్‌ క్లస్టర్‌ లెక్కల ప్రకారం 3.5మిలియన్ల మంది బాలింతలు, పసిపిల్లల్లో పోషక లోపాలు ఉన్నాయని పేర్కొంది.  

విజృంభిస్తున్న కొవిడ్‌..

ఇక్కడ కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు కూడా చాలా తక్కువగా జరుగుతున్నాయి. మొత్తం నాలుగు కోట్ల మంది జనాభా ఉంటే.. కరోనా ప్రారంభమైన నాటి నుంచి ఈ ఏడాది జులై వరకు కేవలం 5,00,000 పరీక్షలు మాత్రమే నిర్వహించినట్లు అక్కడి ఆరోగ్యశాఖ నివేదికలు చెబుతున్నాయి.  వీటిల్లో 1,51,770 పాజిటివ్‌లు వచ్చాయి. ఇక్కడ పాజిటివిటీ రేటు 42శాతం ఉన్నట్లు ఐరాస నివేదిక పేర్కొంది. 
ఆగస్టు 13 నాటికి 7వేల మంది కొవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య ఇంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఆగస్టులో కేసులు తగ్గుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కానీ, సంక్షోభ సమయంలో ఇక్కడ ఏమేరకు పరీక్షలు జరుగుతున్నాయనేది అనుమానాస్పదమే. 

డౌన్‌టు ఎర్త్‌లెక్క ప్రకారం దేశంలో మొత్తం 18లక్షల డోసుల కొవిడ్‌ టీకాలను మాత్రమే ఇప్పటి వరకు పంపిణీ చేశారు. గత నెలలలో కోవ్యాక్స్‌ కార్యక్రమం కింద జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ నుంచి 14లక్షల టీకాలు దేశానికి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ తీసుకొన్నవారి సగటు రేటు 23.6శాతం ఉంటే.. అఫ్గానిస్థాన్లో అది 0.6శాతం వరకు ఉంది. 

గతవారం తాలిబన్లు పక్తియా ప్రావిన్స్‌లో కొవిడ్‌ టీకాల కార్యక్రమాన్ని బ్యాన్‌ చేశారు. ఇటీవల వారు గుంపులుగా అధ్యక్ష భవనంలోకి చొరబడినప్పుడు ఒక్కరు కూడా మాస్కు ధరించి లేరు. తాలిబన్ల ఆక్రమణతో చాలా మంది వలస పోతుండటంతో కరోనా మహమ్మారి మరోసారి విజృంభించే ప్రమాదం ఉంది. ఫలితంగా పొరుగున ఉన్న పాక్‌,ఇరాన్‌ వంటి దేశాల్లో కూడా కరోనా వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉంది. 

పోలియో చుక్కలపై తాలిబన్లకు పగ..!

ప్రపంచంలో పోలియో వైరస్‌ ఇంకా చురుగ్గా ఉన్నదేశాలు రెండే ఉన్నాయి. వాటిల్లో అఫ్గానిస్థాన్‌ కూడా ఒకటి. 2020లో ఇక్కడ 56 పోలియో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు వరుసగా మూడేళ్లపాటు రాకుండా ఉంటేనే పోలియో రహిత దేశంగా ప్రకటిస్తారు. అఫ్గానిస్థాన్‌ పోలియో నిర్మూలన యాక్షన్‌ ప్లాన్‌ (ఎన్‌ఈఏపీ) ప్రకారం తాలిబన్‌ ఆధీనంలోని ప్రాంతాల్లో పోలియో నిర్మూలన కార్యక్రమంలో సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొంది. ఇక్కడ ఇంటింటికి తిరిగి టీకాలు వేయడంపై మూడేళ్లుగా నిషేధం అమల్లో ఉంది. 

ఈ ఏడాది జూన్‌లో నాన్‌గ్రాహర్‌ ప్రావిన్స్‌లో పోలియో వ్యాక్సిన్‌ వేసే కార్యకర్తలను తాలిబన్లు కాల్చి చంపారు.  ఇక ఏప్రిల్‌లో జలాలాబాద్‌లో ముగ్గురు మహిళా ఆరోగ్య కార్యకర్తలను హత్య చేశారు. భద్రతా పరమైన కారణాలతో పోలియో నిర్మూలన కార్యక్రమ వేగం మందగించడంతో మిలియన్ల కొద్దీ పిల్లలకు టీకాలు లభించలేదని లాన్సెన్స్‌ పత్రిక పేర్కొంది. 

తాజాగా అమెరికా సేనలు అఫ్గానిస్థాన్‌ను వీడిపోవడంతో దాదాపు 30 ఏళ్ల నుంచి చేపట్టిన పోలియో నిర్మూలన కార్యక్రమం కుంటుపడే ప్రమాదం నెలకొంది. 2021లో ఇప్పటి వరకు ఒక పోలియో కేసు వచ్చింది. కానీ, ఇప్పుడు అఫ్గాన్‌లోని పరిణామాలు వ్యాక్సినేషన్‌ను మందగింపజేస్తాయని యేల్‌ విశ్వవిద్యాలయ ఎపిడమాలజిస్టు సాద్‌ బి ఒమర్‌ పేర్కొన్నారు. అఫ్గాన్‌తోపాటు పోలియో కేసులు నమోదవుతున్న మరో దేశం పాకిస్థాన్‌.. భూమిపై ఈ రెండు దేశాల్లోనే పోలియో కేసులు ప్రమాదకర స్థాయిలో నమోదవుతున్నాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని