NCERT: అల్లర్ల గురించి పిల్లలకు బోధించడం ఎందుకు?: ఎన్‌సీఈఆర్‌టీ చీఫ్‌

ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో సిలబస్‌ మార్పుపై డైరెక్టర్‌ దినేశ్‌ ప్రసాద్‌ సక్లానీ స్పందించారు. విద్యార్థులకు అల్లర్ల గురించి బోధించడం తమ ఉద్దేశం కాదన్నారు.

Published : 17 Jun 2024 00:07 IST

దిల్లీ: తొమ్మిది నుంచి 12వ తరగతులకు సంబంధించిన సిలబస్‌లో కొన్ని పాఠ్యాంశాలను నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (NCERT) తొలగించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఉద్యమాలు, రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యం ముందున్న సవాళ్లు పాఠాలు, బాబ్రీ మసీదు కూల్చివేత వంటి మరికొన్ని అంశాలు తొలగించిన వాటిలో ఉన్నాయి. దీంతో కాషాయీకరణ చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఎన్సీఈఆర్‌టీ డైరెక్టర్‌ దినేశ్‌ ప్రసాద్‌ సక్లానీ (Dinesh Prasad Saklani) స్పందించారు.

‘‘పాఠ్య పుస్తకాల ద్వారా చిన్నారులకు అల్లర్ల గురించి ఎందుకు బోధించాలి? సమాజంలో నేరాలు, హింస ఎలా సృష్టించాలి? బాధితులుగా ఎలా మారాలి? అనే విషయాలను మన విద్యార్థులకు బోధించాలా? ఇదేనా విద్య ముఖ్య ఉద్దేశం. అసలు అల్లర్ల గురించి చిన్న వయసులో వారికెందుకు.’’ అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దినేశ్‌ సక్లానీ పేర్కొన్నారు.

అది మా బాధ్యత.. 

‘‘బాబ్రీ మసీదు లేదా రామ జన్మభూమిపై సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే దాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చకూడదా? దాంట్లో సమస్య ఏమిటీ? కొత్త పార్లమెంటును నిర్మిస్తే వాటి గురించి మన విద్యార్థులు తెలుసుకోవద్దా? ఇటువంటి వాటిని చేర్చాం. చారిత్రక విషయాలతోపాటు సమకాలీన అంశాలను చేర్చడం మా బాధ్యత’’ అని అన్నారు.

‘నీట్‌’ వివాదం.. సుప్రీం ‘కమిటీ’తో దర్యాప్తు జరిపించాలి: సిబల్‌

సిలబస్‌ను కాషాయీకరణ చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ.. విద్యార్థులకు వాస్తవాలను తెలియజేయడమే తమ ఉద్దేశమన్నారు. చరిత్రను తెలియజేసే అంశాలను వారికి బోధిస్తామని.. అంతేకానీ, యుద్ధానికి మద్దతుగా బోధన ఉండదన్నారు. బాధ్యత గల పౌరులను మాత్రమే సమాజానికి అందించాలనుకుంటున్నామని దినేశ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని