జులియన్‌ అసాంజేకు మరోసారి చుక్కెదురు!

వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జులియన్‌ అసాంజేకు బ్రిటిష్‌ కోర్టులో మరోసారి చుక్కెదురైంది.

Published : 06 Jan 2021 23:20 IST

లండన్‌: వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జులియన్‌ అసాంజేకు బ్రిటిష్‌ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. తాను పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను బ్రిటన్‌లోని జిల్లా కోర్టు తిరస్కరించింది. అసాంజే మరికొంత కాలం పాటు జైలులోనే ఉండాలని వెల్లడించింది. అంతకుముందు, గూఢచర్యం కేసులో విచారణ నిమిత్తం తమ దేశానికి రప్పించేందుకు అమెరికా చేసిన విజ్ఞప్తిని కూడా జిల్లా న్యాయమూర్తి వనెస్సా బరైట్సర్‌ తిరస్కరించారు. అయితే, కోర్టు నిర్ణయంపై అప్పీలుకు వెళ్తామని..ఆ ప్రక్రియ కొనసాగుతుందని అమెరికా తెలిపింది.

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఓ కేసులో తనను స్వీడన్‌కు అప్పగిస్తారనే భయంతో 2012లో లండన్‌లోని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో అసాంజే తలదాచుకున్నారు. సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం 2019లో ఆయనను ఆ రాయబార కార్యాలయం బయటకు తీసుకొచ్చిన లండన్‌ పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్‌ షరతులను అతిక్రమించిన కారణంగా అసాంజెకు లండన్‌లోని జిల్లా కోర్టు 50వారాల శిక్ష విధించింది. దీంతో ఆయన బెల్మార్ష్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, ఆ కేసులో అసాంజేపై ఉన్న అభియోగాలు మాత్రం తొలగిపోయాయి. కొన్నిరోజుల కిందటే శిక్ష కాలం పూర్తయినప్పటికీ, గతంలో పరారీలో ఉన్న చరిత్ర కారణంగా జైలులోనే ఉంచాలని తాజాగా లండన్‌లోని కోర్టు అభిప్రాయపడింది.

ఇదిలాఉంటే, పదేళ్ల క్రితం అమెరికా సైనిక, దౌత్య కార్యకలాపాలకు సంబంధించి వికీలీక్స్‌ సంస్థ బయటపెట్టిన రహస్యాలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అసాంజేపై గూఢచర్యానికి సంబంధించి 17 అభియోగాలు ఉన్నాయని, వికీలీక్స్‌ సంస్థపై కంప్యూటర్‌ దుర్వినియోగం కేసు ఉందని అమెరికా వాదిస్తోంది. వాటిలో ఆయనకు గరిష్ఠంగా 175 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. అయితే అమెరికా వాదనను అసాంజే తరఫు న్యాయవాదులు ఖండిస్తున్నారు. ఒక జర్నలిస్టుగా అసాంజే అమెరికా సైన్యం ఇరాక్‌, అఫ్గానిస్థాన్‌లో చేస్తున్న దారుణాలను బయటపెట్టారని, భావప్రకటన స్వేచ్ఛ హక్కు ద్వారా ఆయనకు ఆ అధికారం ఉందని చెబుతున్నారు.

ఇవీ చదవండి..
బ్రిటన్‌: అసాంజేను అమెరికాకు అప్పగించం..
41 దేశాలకు పాకిన కొత్తరకం కరోనా!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని