Published : 01 Nov 2021 14:33 IST

Nawab Malik: రాజకీయ రంగులోకి డ్రగ్స్‌ వివాదం..!

 దేవేంద్ర ఫడణవీస్‌ వర్సెస్‌ నవాబ్‌ మాలిక్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. మహారాష్ట్రలోని కాకలు తీరిన రాజకీయ నాయకులు ఈ వివాదంలో భాగస్వాములు అవుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేపై తీవ్ర ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ను కూడా ఇందులోకి లాగారు. జయదీప్‌ రాణా అనే మాదక ద్రవ్యాల సరఫరాదారుడితో ఫడణవీస్‌ దిగిన ఫొటోను మాలిక్‌ ట్వీట్‌ చేశారు. ఈ ఫొటో 2018లో అమృత ఫడణవీస్‌ రివర్‌ యాంథమ్‌ ప్రాజెక్టు సందర్భంగా తీసిందిగా భావిస్తున్నారు. ఆ ప్రాజెక్టుకు ఫైనాన్స్‌ హెడ్‌గా జయదీప్‌ వ్యవహరించారని మాలిక్‌ ఆరోపించారు.

ఈ ఆరోపణలపై దేవేంద్ర ఫడణవీస్‌ స్పందించారు. నవాబ్‌ మాలిక్‌ ట్వీట్‌ చేసిన ఫొటోల్లోని వ్యక్తిని ‘రివర్‌ మార్చ్‌’ అనే సంస్థ నియమించుకుందని పేర్కొన్నారు. సదరు వ్యక్తి అక్కడున్న ప్రతిఒక్కరితో ఫొటోలు దిగారని వెల్లడించారు. అతడు ఫొటోలు దిగిన వారిలో తాను, తన భార్య కూడా ఉన్నామన్నారు. ‘అతడు నాపై దాడిచేయడంలేదు.. నా భార్యపై విమర్శలు చేస్తున్నారు. మేం మర్యాద దాటలేదు. కానీ, సమాధానం చెబుతాం. ఆటను ఆయన మొదలుపెట్టాడు.. దీపావళీ అయ్యే వరకు వేచి ఉండండి’ అని ఫడణవీస్‌ పేర్కొన్నారు. చీకటి ప్రపంచంతో నవాబ్‌మాలిక్‌కు ఉన్న సంబంధాలను త్వరలోనే బహిర్గతం చేస్తామన్నారు. నవాబ్‌ మాలిక్‌ తన అల్లుడు సమీర్‌ ఖాన్‌ కేసును బలహీనపర్చేందుకు ఇలా చేస్తున్నాడని ఫడణవీస్‌ ఆరోపించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తాను మాట్లాడనని చెప్పారు.

ఎవరీ సమీర్‌ ఖాన్‌.. ఏమిటా కేసు..?

నవాబ్‌ మాలిక్‌ 1950వ సంవత్సరం ఉత్తరప్రదేశ్‌లోని దుస్వాలో జన్మించారు. ఆయన కుటుంబం 1970లో ముంబయికి వలస వచ్చింది. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. తొలుత సమాజ్‌వాదీ పార్టీలో చేరిన నవాబ్‌.. ఆ తర్వాత నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అణుశక్తి నగర్‌ అసెంబ్లీ స్థానంలో విజయం సాధించారు. ప్రస్తుతం మహారాష్ట్ర మైనార్టీ డెవలప్‌మెంట్‌ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. 

ప్రస్తుతం దేవేంద్ర ఫడణవీస్‌ ప్రస్తావించిన సమీర్‌ ఖాన్‌ నవాబ్‌మాలిక్‌కు స్వయాన అల్లుడు. ఇతను డ్రగ్స్‌ కింగ్‌పిన్‌గా పేరుబడ్డ కరణ్‌ సంజానీకి సహ పెట్టుబడిదారుగా వ్యవహరిస్తున్నాడని ఎన్‌సీబీ ఆరోపించింది. ఇతనికి రాహిలా ఫర్నిచర్‌ వాలా సహకరిస్తున్నట్లు తేలింది. వీరికి ముంబయిలోని ప్రఖ్యాత ముచ్చద్‌ పాన్‌వాల యాజమాన్యంతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించింది. ఇక్కడ డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లు ఎన్‌సీబీ పేర్కొంది. ఇక సమీర్‌ ఖాన్‌ నుంచి కొంత సొమ్ము కరణ్‌ సంజనానీకి బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో జనవరి రెండో వారంలో సమీర్‌ ఖాన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు. 194 కిలోల గంజాయి, ఆరు సీబీడీ స్ప్రేల కొనుగోలుకు, రవాణాకు యత్నించారనే అభియోగాలు మోపారు. ఈ కేసు విషయంలో ఎన్‌సీబీ పట్టుదలగా ఉండటంతో దాదాపు ఎనిమిది నెలలకు పైగా సమీర్‌ ఖాన్‌ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. సెప్టెంబర్‌ చివరి వారంలో అతడికి బెయిల్‌ వచ్చింది.  కానీ బెయిల్‌ ప్రక్రియ జాప్యం అయ్యింది. మరోవైపు బెయిల్‌ రద్దుకు ఎన్‌సీబీ న్యాయపోరాటం చేసింది. కానీ, ఎట్టకేలకు అక్టోబర్‌ 13వ తేదీన సమీర్‌ఖాన్‌ బెయిల్‌ కాపీ వచ్చింది. ఆ తర్వాత  నుంచి నవాబ్‌ మాలిక్‌ గురిలోకి సమీర్‌ వాంఖడే వచ్చారు. వరుసగా బలమైన ఆరోపణలు చేస్తూ.. వాటిని బలపర్చే ఆధారాలను బయటపెడుతూ సంచలనాలు సృష్టిస్తున్నారు. 

ఎస్సీ కమిషన్‌తో భేటీ అయిన వాంఖడే 

ఎన్‌సీబీ జోనల్‌ కమిషనర్‌ సమీర్‌ వాంఖడే సోమవారం ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ విజయ్‌ సంప్లాను కలుసుకొన్నారు. ఇప్పటికే ఆయన ఎస్సీ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ అరుణ్‌ హల్దార్‌తో భేటీ అయ్యారు. వాంఖడే ముస్లిం అని.. ఉద్యోగ ఎంపిక సమయంలో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం ఇచ్చారని నవాబ్‌ మాలిక్‌ గత నెలలో ఆరోపించారు. దీనిపై వాంఖడే ఎస్సీ కమిషన్‌ వద్ద ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కమిషన్‌ కూడా దర్యాప్తు ప్రారంభించింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్