
Rakesh Tikait: మా డిమాండ్లను నెరవేరిస్తేనే.. ఇంటికి వెళ్తాం: రాకేశ్ టికాయత్
దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో రైతులు హర్షం వ్యక్తం చేసినా.. మరికొన్ని డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నారు. వాటిని నెరవేరిస్తేనే ఆందోళన విరమించి, ఇంటిముఖం పడతామని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ వెల్లడించారు. ‘కేంద్రం నూతన సాగు చట్టాలను రద్దు చేసింది. కానీ, కనీస మద్దతు ధర, ఆందోళనలో అమరులైన 700 మంది రైతులకు పరిహారం, విద్యుత్ సవరణ బిల్లు.. రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుంచి అజయ్ మిశ్రాను తొలగించాలన్న డిమాండ్లను జనవరి 26లోగా కేంద్రం నెరవేర్చాలి. అప్పుడే మేమంతా తిరిగి ఇంటికి వెళ్తాం’అని టికాయత్ తెలిపారు.
30 ట్రాక్టర్లలో దిల్లీకి 500 మంది రైతులు..
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న పోరాటానికి నవంబర్26తో ఏడాది పూర్తికానున్న నేపథ్యంలో నవంబర్ 29న 500 మంది రైతులు 30 ట్రాక్టర్లలో ర్యాలీగా దిల్లీకి చేరుకుంటారని బీకేయూ నేత రాకేశ్ టికాయత్ చెప్పారు. పూర్తి వివరాలు నవంబర్ 26న జరిగే సమావేశం తర్వాత వెల్లడిస్తానని తెలిపారు.
ఎన్నికలపై అప్పుడే మాట్లాడుతాం
వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల విషయంలో రైతు సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లోనూ త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ రెండు ప్రాంతాలకు చెందిన రైతులు కూడా రైతు ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రాకేశ్ టికాయత్ స్పందిస్తూ.. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత తాము ఎన్నికలపై మాట్లాడుతామని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.