Live streaming: ప్రస్తుతానికి యూట్యూబ్‌లోనే ‘సుప్రీం’ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు(Supreme Court)లో కీలక విచారణలను ప్రత్యక్ష ప్రసారం(Live Stream)లో వీక్షించే అవకాశం సెప్టెంబర్‌ 27 నుంచి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికి...

Published : 27 Sep 2022 01:27 IST

త్వరలోనే సొంత వేదిక: సీజేఐ యు.యు.లలిత్‌

దిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు(Supreme Court)లో కీలక విచారణలను ప్రత్యక్ష ప్రసారం(Live Stream)లో వీక్షించే అవకాశం సెప్టెంబర్‌ 27 నుంచి అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ప్రస్తుతానికి యూట్యూబ్‌(YouTube) మాధ్యమాన్ని తాత్కాలికంగా వినియోగించుకోనున్నప్పటికీ.. రానున్న రోజుల్లో సొంత వేదిక ద్వారానే ఈ సౌకర్యం కల్పిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. అత్యున్నత న్యాయస్థానంలో జరిగే కార్యకలాపాల కాపీరైట్‌ హక్కులను.. యూట్యూబ్‌ వంటి ప్రైవేట్‌ వేదికలకు అప్పగించకూడదంటూ భాజపా మాజీ నేత కేఎన్‌ గోవిందాచార్య తరఫు న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వెబ్‌కాస్ట్‌పై కాపీరైట్‌ హక్కులను యూట్యూబ్‌ స్పష్టంగా కోరినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు విన్న సీజేఐ జస్టిస్‌ యు.యు.లలిత్‌(Justice UU Lalit) నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఈ వేదికను ఉపయోగిస్తామని తెలిపింది. కాపీరైట్‌ సమస్యలపై దృష్టిసారిస్తామని పేర్కొంటూనే.. ప్రత్యక్ష ప్రసారం కోసం ప్రత్యేకంగా సొంత వేదిక ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 17కు వాయిదా వేసింది. కేసుల విచారణలను లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయడానికి అనుకూలంగా సుప్రీం కోర్టు 2018లోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఆచరణలోకి రాలేదు. అయితే, భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పదవీ విరమణ రోజైన ఆగస్టు 26న.. ఆయన నేతృత్వంలోని ధర్మాసనం కార్యకలాపాలను దేశ ప్రజలంతా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. సుప్రీంకోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే తొలిసారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని