సచిన్‌, లతా మంగేష్కర్‌ ట్వీట్లపై దర్యాప్తు..!

మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది..! కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను సమర్థించేలా పలువురు సెలబ్రిటీలు చేసిన .....

Updated : 09 Feb 2021 11:38 IST

కేంద్రం ఒత్తిడి ఉందంటూ కాంగ్రెస్‌ ఆరోపణ

ముంబయి: మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది..! కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను సమర్థించేలా పలువురు సెలబ్రిటీలు చేసిన ట్వీట్‌లపై విచారణకు ఆదేశించింది. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌, లెజెండరీ గాయని లతా మంగేష్కర్‌ వంటి పలువురు సెలబ్రిటీలు కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితోనే ఈ చట్టాలను సమర్థిస్తూ ట్వీట్లు చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేసి నిగ్గుతేల్చాలని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ని కాంగ్రెస్‌ కోరింది. ఈ మేరకు మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సచిన్‌ సావంత్‌ హోంమంత్రితో వర్చువల్‌ విధానంలో సమావేశమై సెలబ్రిటీల ట్వీట్లపై దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు. 

దిల్లీ సరిహద్దుల్లో రైతులు కొనసాగిస్తున్న పోరాటానికి మద్దతుగా ప్రపంచ సెలబ్రిటీల విమర్శలకు  ప్రతిస్పందనగా భారత ప్రముఖులు పోస్ట్ చేసిన ట్వీట్లపై దర్యాప్తు చేయాలని కోరారు. అనంతరం దీనిపై ట్వీట్‌ చేసిన కాంగ్రెస్‌ నేత సచిన్‌ సావంత్‌.. ‘సెలబ్రిటీల ట్వీట్లతో భాజపాకు ఉన్న సంబంధంపై దర్యాప్తుకు డిమాండ్‌ చేశాను. అలాగే, మన జాతీయ హీరోలకు అవసరమైతే, భద్రత కల్పించాలి. ఈ ప్రముఖులు చేసిన ట్వీట్లు వెనుక భాజపా హస్తం ఉందేమో తెలుసుకోవాలి. ఇంటెలిజెన్స్‌ విభాగంతో దర్యాప్తునకు  అనిల్‌ దేశ్‌ముఖ్‌  ఆదేశించారు’’ అని పేర్కొన్నారు. 

చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..

అమెరికా పాప్‌ సింగర్‌ రిహానా, ప్రపంచ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌ రైతులకు మద్దతుగా ట్వీట్లు చేసిన తర్వాత దేశంలోని పలువురు ప్రముఖులు ఈ చట్టాలకు మద్దతుగా ట్వీట్లు చేయడం వెనుక కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌, సినీనటుడు అక్షయ్‌కుమార్‌ కూడా ఇలాంటి ట్వీట్లే చేశారని తెలిపారు. ‘‘కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం వీడియో  కాన్ఫరెన్స్‌ ద్వారా నాతో సమావేశమైంది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గత 70 రోజులుగా దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతులకు సంబంధించిన అంశంలో సెలబ్రిటీలను దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని కోరింది. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సచిన్‌ సావంత్‌ ఈ అంశంపై నాతో చర్చించారు. నాకు కొవిడ్‌ సోకినప్పటికీ.. రైతులకు సంబంధించిన వ్యవహారం కావడంతో వాళ్లకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చాను. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వారికి హామీ ఇచ్చాను’’ అని అనిల్‌ దేశ్‌ముఖ్‌ తెలిపారు.

ఇదీ చదవండి..

చర్చలకు సిద్ధమే.. తేదీ చెప్పండి: రైతులు


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts