Shraddha Murder: శ్రద్ధ ఫిర్యాదుపై పోలీసులేం చర్యలు తీసుకున్నారో దర్యాప్తు చేస్తాం: ఫడణవీస్‌

ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన శ్రద్ధా వాకర్‌(Shraddha walker) గతంలో ముంబయి పోలీస్‌ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదుపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌(Devendra Fadnavis) స్పందించారు. ఆ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో దర్యాప్తు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు.  

Published : 21 Dec 2022 01:37 IST

ముంబయి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌(Shraddha walkar) హత్యోదంతంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌(Devendra Fadnavis) స్పందించారు. ఆఫ్తాబ్‌ అమీన్‌ పూనావాలా తనను వేధిస్తున్నాడంటూ గతేడాది నవంబర్‌లో శ్రద్ధావాకర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై ముంబయి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అంశంపై దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. తన సహజీవన భాగస్వామి శ్రద్ధను ఆఫ్తాబ్‌ ఈ ఏడాది మే నెలలో అత్యంత కిరాతకంగా చంపి ముక్కలు చేసి దేశ రాజధాని నగరంలో పలుచోట్ల విసిరేసిన ఘటన యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ అంశం మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తావనకు రావడంతో  డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ స్పందించారు.

మరోవైపు, 2020లోనే శ్రద్ధా వాకర్‌ ఆఫ్తాబ్‌కు వ్యతిరేకంగా మహారాష్ట్రలో ఫిర్యాదు చేశారు. తనను కొడుతున్నాడని, ముక్కలు చేసి చంపుతానంటూ బెదిరింపులకు గురిచేశాడంటూ శ్రద్ధ పాల్‌ఘర్‌ జిల్లాలోని తులింజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, ఈ లేఖ బయటకు వచ్చిన తర్వాత డీసీపీ సుహాస్‌ బవాచే మాట్లాడుతూ.. శ్రద్ధ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్టు వెల్లడించారు. అయితే, ఈ అంశాన్ని తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తావించిన డిప్యూటీ సీఎం ఫడణవీస్‌.. ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని శ్రద్ధపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని ఇప్పటికే తేలిందన్నారు. అయితే, ఆమె ఫిర్యాదు చేయడానికి, ఉపసంహరించుకోవడానికి మధ్య దాదాపు నెల రోజులు గ్యాప్‌ ఉందని.. ఆ సమయంలో ఆ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అంశంపై మాత్రం దర్యాప్తు చేస్తామని స్పష్టంచేశారు.

శ్రద్ధా వాకర్‌ను చంపి, ఆమె శరీరాన్ని అతి దారుణంగా ముక్కలు చేసిన ఆఫ్తాబ్‌ను దిల్లీ పోలీసులు గత నెల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటికే నిందితుడికి పాలీగ్రాఫ్‌, నార్కో పరీక్షలు చేశారు. ఆఫ్తాబ్‌ చెప్పిన వివరాల ఆధారంగా.. మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మానవ అవశేషాలను గుర్తించారు. ఆ శరీర భాగాలు శ్రద్ధావేనని డీఎన్‌ఏ పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఇక నిందితుడి ఇంట్లో గుర్తించిన రక్తం నమూనాలు కూడా మృతురాలివేనని నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. శ్రద్ధా హత్య కేసులో పోలీసులు ఇంకా ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయలేదు. ప్రస్తుతానికి నిందితుడిని జ్యుడిషియల్‌ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. జ్యుడీషియల్‌ కస్టడీని ఇటీవల న్యాయస్థానం డిసెంబర్‌ 23వరకు పొడిగించగా.. ప్రస్తుతం ఆఫ్తాబ్‌ తీహాడ్‌ జైలులో ఉన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని