Published : 29 Mar 2022 03:09 IST

Ajay Mishra: ఆరోపణలు రుజువుచేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా

దిల్లీ: తనపై ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలు రుజువుచేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా పేర్కొన్నారు. లఖింపుర్‌ ఖేరీ ఘటనలో తన కుమారుడు నిందితుడిగా ఉన్న కారణంగా తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేయడాన్ని తప్పుబట్టారు. శిక్షపడిన వారి భౌతిక, జీవ నమూనాలను సేకరించేందుకు వీలు కలిపించే క్రిమినల్‌ ప్రొసీజర్‌ (ఐడెంటిఫికేషన్‌) బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర మంత్రి ఈ విధంగా మాట్లాడారు.

‘కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌధరీకి ఒక్క విషయం చెప్పదలచుకున్నా.  నామీద ఒక్క కేసు ఉన్నా, కనీసం ఒక్క నిమిషం జైలుకు వెళ్లినట్లు నిరూపించినా.. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా’ అంటూ కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా పేర్కొన్నారు. లోక్‌సభలో బిల్లును ప్రవేశపెడుతోన్న సమయంలో లఖింపుర్‌ ఖేరీ ఘటనను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ నేతలు చేసిన విమర్శలకు ఇలా స్పందించారు. తనపై చేస్తోన్న ఆరోపణలను కాంగ్రెస్‌ నేతలు రుజువు చేయాలన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆందోళన చేస్తోన్న రైతులపైకి కేంద్ర మంత్రి కుమారుడు అశీష్‌ మిశ్రా వాహనం దూసుకెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు రైతులతో సహా అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల్లో మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. కుట్రలో భాగంగానే కేంద్ర మంత్రి కుమారుడు ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తు నివేదిక కూడా వెల్లడించింది. ఇలా దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీసిన ఆ కేసులో కేంద్ర మంత్రి కుమారుడు అశీష్‌ మిశ్రా అరెస్టయినప్పటికీ నాలుగు నెలల తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే, లఖింపుర్‌ ఖేరీ ఘటనలో కేంద్ర మంత్రి ప్రమేయం ఉందంటూ ఆరోపిస్తోన్న ప్రతిపక్ష పార్టీలు.. అందుకు బాధ్యతగా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని