Germany: భవిష్యత్తులో భారతీయులకు జర్మనీలో విద్యా, ఉద్యోగాలు మరింత సులువు..!

భారతీయులకు భవిష్యత్తులో జర్మనీలో మరిన్ని విద్యా, ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు జర్మనీ-భారత్‌లు అతిత్వరలో కీలక ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. 

Updated : 05 Dec 2022 12:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భవిష్యత్తులో జర్మనీ(Germany)లో విద్యా, పరిశోధనలు, ఉద్యోగాలు చేయడం భారతీయులకు మరింత సులువుకానుందని ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అన్నాలేనా బేర్‌బాక్‌ (Annalena Baerbock)పేర్కొన్నారు. ఆమె రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌ (india) చేరుకొన్నారు. ఈ సందర్భంగా బేర్‌బాక్‌ మాట్లాడుతూ భారత్‌తో ద్వైపాక్షిక మొబిలిటీ అగ్రిమెంట్‌ (Bilateral Mobility Agreement)పై సంతకం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఒప్పందంతో ఇరు దేశాల ప్రజల రాకపోకలు మరింత సులువు అవుతాయని వెల్లడించారు. భారత్‌ సందర్శన అంటే.. ప్రపంచంలో ఆరోవంతును చూసినట్లే అని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలోగా భారత్‌ జనాభా చైనాను దాటేస్తుందన్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో 21శతాబ్దంలో అంతర్జాతీయ విధానాలపై భారత్‌ స్పష్టమైన ముద్ర వేస్తుందని అభిప్రాయపడ్డారు. భారత్‌ 40 కోట్ల మంది  ప్రజలను గత 15 ఏళ్లలో పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిందని.. ఈ సంఖ్య ఐరోపా సమాఖ్య జనాభాతో సమానమన్నారు.

భారత్‌ జీ-20 (G-20)అధ్యక్ష బాధ్యతలపై అన్నాలేనా స్పందిస్తూ..‘‘ప్రపంచ వ్యాప్తంగా కీలక పాత్ర పోషించడానికి భారత్‌ సిద్ధమైంది. ఈ విషయాన్ని బాలీలో జరిగిన జీ-20 సదస్సులో భారత్‌ చూపించింది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని జీ20 వ్యతిరేకించడంలో అద్భుత పాత్ర పోషించింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా, బలమైన ప్రజాస్వామ్యంగా భారత్‌ చాలా దేశాలకు వారధి వలే నిలిచింది’’ అని పేర్కొన్నారు. సామాజిక వైవిధ్యం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాలే ఆర్థిక అభివృద్ధికి, శాంతికి ఇంజిన్ల వంటివని ఆమె అభివర్ణించారు. ఆమె దిల్లీ విమానాశ్రయంలో దిగిన చిత్రాన్ని  విదేశీ వ్యవహారాల శాఖ అధికారిక ప్రతినిధి అరిందం బాగ్చీ ట్విటర్‌లో పోస్టు చేశారు. ఈ పర్యటనలో ఆమె భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌తో భేటీ కానున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని