Modi: వారి ఆలస్యం ఖరీదు రూ.9700కోట్లు..! విపక్షాలపై మోదీ ఫైర్‌

ఎన్నికల రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో మరో మెగా ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. బలరాంపూర్‌లో నిర్మించిన సరయూ కెనాల్‌ నేషనల్‌ ప్రాజెక్టును

Published : 11 Dec 2021 17:45 IST

బలరాంపూర్‌: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో మరో మెగా ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. బలరాంపూర్‌లో నిర్మించిన సరయూ కెనాల్‌ నేషనల్‌ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీపై మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాల ఆలస్యంగా కారణంగా ప్రాజెక్టు ఖర్చు దాదాపు 100 రెట్లు పెరిగిందని దుయ్యబట్టారు. 

‘‘ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం కోసం నేను దిల్లీ నుంచి బయల్దేరినప్పటి నుంచి ఒకటే ఆలోచిస్తున్నా. ఎవరైనా వచ్చి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది తామే అని అంటారేమో అని ఎదురుచూశా. కొందరికి అదో అలవాటు. వారు కేవలం ప్రారంభోత్సవాల్లో రిబ్బన్‌ కటింగ్‌లకే ప్రాధాన్యతనిస్తారు. ఆ తర్వాత పని గురించి మర్చిపోతారు. కానీ మేం సమయానికి ప్రాజెక్టు పూర్తి చేయడానికే ప్రాధాన్యమిస్తాం. వారు ఊహల్లోనే ఉంటారు. మేం వాస్తవంలో అమలు చేసి చూపిస్తాం’’ అంటూ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌పై ప్రధాని పరోక్షంగా విమర్శలు కురిపించారు. 

సరయూ కెనాల్‌ ప్రాజెక్టుపై ఈ ఉదయం అఖిలేష్‌ యాదవ్‌ ఓ ట్వీట్ చేశారు. ‘‘ఈ ప్రాజెక్టు 75శాతం పని సమాజ్‌వాదీ పార్టీ హయంలోనే పూర్తయ్యింది. మిగతా పనిని పూర్తిచేసేందుకు భాజపాకు ఐదేళ్లు పట్టింది’’ అని అఖిలేష్‌ భాజపాపై విమర్శలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ చేసిన అభివృద్ధికి.. యోగి ప్రభుత్వం పేరు తెచ్చుకోవాలని చూస్తోందని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలకు పరోక్షంగా స్పందించిన ప్రధాని మోదీ.. విపక్షాలపై మండిపడ్డారు. 

‘‘గత ప్రభుత్వాల ఆలోచనా విధానం వల్లే సరయూ కెనాల్‌ ప్రాజెక్టు నిర్మాణానికి 50ఏళ్లు పట్టింది. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం ప్రారంభించినప్పుడు ఖర్చు అంచనా రూ.100కోట్ల కంటే తక్కువే. ఇప్పుడు దీని నిర్మాణానికి దాదాపు రూ.9,800కోట్లు ఖర్చయ్యింది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా దేశం ఈ ప్రాజెక్టుకు దాదాపు 100రెట్లు అధికంగా ఖర్చు చేయాల్సి వచ్చింది’’ అని ప్రధాని దుయ్యబట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని