
Donald Trump: ‘దేశ నాయకుడు మూర్ఖుడిలా కనిపించారు’
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై విరుచుకుపడ్డారు. అఫ్గాన్‌నుంచి అమెరికన్ బలగాల ఉపసంహరణ క్రమంలో బైడెన్ అసమర్థంగా వ్యవహరించారన్నారు. 9/11 దాడులు జరిగి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. శనివారం ట్రంప్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఇది చాలా విచారకరమైన రోజు అని పేర్కొన్నారు. అమెరికాకు హాని కలిగించిన వారిపై ఇటీవల యుద్ధం ముగించిన తీరూ విచారకరమని.. అఫ్గాన్ యుద్ధాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తప్పుడు ప్రణాళికలు, బలహీనత, ఏం జరుగుతోందో అర్థం చేసుకోలేని నాయకులే ఇందుకు కారణమని ఆరోపించారు. ‘దేశ నాయకుడు మూర్ఖుడిలా కనిపించారు. ఇలా ఎప్పుడూ జరగకూడదు’ అని బైడెన్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. ఆగస్టు 26న కాబుల్ విమానాశ్రయం వెలుపల జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది అమెరికా సైనికులు మృతి చెందడం, అగ్రరాజ్యం వదిలేసిన ఆయుధ సామగ్రిని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంపై కూడా ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. ‘జో బైడెన్, ఆయన అసమర్థ పాలన.. ఓటమికి లొంగిపోయాయి. దీంతో కలిగిన ఇబ్బందుల నుంచి కోలుకునేందుకు అమెరికన్లు కష్టపడాల్సి వస్తుందని’ అన్నారు. 9/11 దాడుల అనంతరం అమెరికా.. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు అఫ్గాన్‌లోకి అడుగుపెట్టడం, 20 ఏళ్ల సుదీర్ఘ పోరు తర్వాత ఇటీవల అక్కడి నుంచి బలగాల ఉపసంహరణ పూర్తి చేసిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.