Lalit Modi: రాహుల్‌ గాంధీపై దావా వేస్తా: లలిత్‌ మోదీ

రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, దీనిపై తాను యూకే కోర్టుకు వెళ్తాలని ఐపీఎల్‌ మాజీ ఛైర్మన్‌ లలిత్‌ మోదీ (Lalit Modi) హెచ్చరించారు. ‘మోదీ’ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్న సమయంలో లలిత విమర్శలు చేయడం గమనార్హం.

Updated : 30 Mar 2023 16:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మోదీ ఇంటిపేరు’పై చేసిన వ్యాఖ్యల కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi). ఇలాంటి సమయంలో ఐపీఎల్‌ సృష్టికర్త, మాజీ ఛైర్మన్‌ లలిత్‌ మోదీ (Lalit Modi).. రాహుల్‌పై తీవ్రంగా మండిపడ్డారు. మనీ లాండరింగ్‌ వ్యవహారంలో తనపై అసత్య, నిరాధార ఆరోపణలు చేస్తున్నందుకు గానూ.. కాంగ్రెస్‌ నేతపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ మేరకు వరుస ట్వీట్లలో రాహుల్‌, కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు.

‘‘నేను న్యాయప్రక్రియ నుంచి పారిపోయానని గాంధీ మద్దతుదారులు, ప్రతి ఒక్కరూ ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకు? ఎలా? రాహుల్‌ గాంధీ మాదిరిగా.. ఇప్పటివరకు నేను ఏ కేసులోనైనా దోషిగా తేలానా? ప్రతిపక్ష నేతలు ఏమీ చేయలేక.. ఇలా అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని ఇప్పుడు సామాన్య పౌరుడు కూడా అర్థం చేసుకోగలడు. ఈ తప్పుడు ఆరోపణలకు గానూ రాహుల్‌కు వ్యతిరేకంగా నేను యూకే కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నా. అప్పుడైనా ఒక బలమైన ఆధారాలతో రావాల్సి ఉంటుంది. అవి దొరక్క ఆయన ఫూల్‌ అవడం నేను చూస్తాను. గాంధీ కుటుంబానికి సన్నిహితులైన చాలా మంది కాంగ్రెస్‌ నేతలకు విదేశాల్లో ఆస్తులున్నాయి. మీ అసత్య ఆరోపణలతో ప్రజలను తెలివితక్కువ వారిని చేయలేరు. తాము మాత్రమే ఈ దేశాన్ని పాలించేందుకు అర్హులమని గాంధీ కుటుంబం భావిస్తోంది’’ అని లలిత్‌ మోదీ (Lalit Modi) ఘాటు విమర్శలు చేశారు.

‘‘గత 15 ఏళ్లలోనే నేను ఒక్క రూపాయి కూడా అక్రమంగా దోచుకున్నట్లు ఇప్పటివరకు నిరూపణ కాలేదు. అయితే, నిజమేంటంటే.. దాదాపు 100 బిలియన్‌ డాలర్లను సంపాదించి పెట్టిన ప్రపంచంలోనే అత్యంత గొప్ప క్రీడా టోర్నీని నేను నిర్వహించాను. 1950 నుంచి కాంగ్రెస్‌ ఈ దేశం కోసం చేసిన దానికంటే ఎక్కువగా, వారి ఊహలకు మించి ‘మోదీ’ కుటుంబం (ఆ కమ్యూనిటీని ఉద్దేశిస్తూ) ఈ దేశానికి సేవ చేసింది. నేను కూడా ఎక్కువే చేశాను. నేను దోచుకున్నానని మీరు ఎంత అరిచినా లాభం లేదు. ఇక భారత్‌లో కఠినమైన చట్టాలను తీసుకొచ్చిన తర్వాత నేను తప్పకుండా తిరిగొస్తాను’’ అని మోదీ రాసుకొచ్చారు.

ఐపీఎల్‌ కుంభకోణంలో లలిత్‌ మోదీ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అటు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణంలో నీరవ్‌ మోదీ నిందితుడిగా ఉన్నారు. ఈ స్కామ్‌లపై గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న రాహుల్‌.. ఆ మధ్య ‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో? అని వ్యాఖ్యలు చేశారు. ఇవి కాస్త తీవ్ర దుమారం రేపడంతో పాటు ఆయనపై పరువునష్టం కేసు కూడా దాఖలైంది. ఈ కేసులో ఇటీవల విచారణ జరిపిన సూరత్‌ కోర్టు.. రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయనపై లోక్‌సభ సచివాలయం అనర్హత వేటు వేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాహుల్‌పై లలిత్‌ మోదీ విమర్శలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు