‘ మీ విమానం ఎక్కను’: ఎయిరిండియా సేవలపై ఓ నెటిజన్ అసహనం

ఎయిరిండియా(Air India) సంస్థ అందించిన సేవలపై ఓ నెటిజన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకెప్పుడు ఆ విమానం ఎక్కనంటూ పోస్టు పెట్టారు. 

Published : 26 Jun 2024 00:07 IST

దిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) విమానంలో ఎదురైన అనుభవంపై ఓ ప్రయాణికుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇంకెప్పుడూ ఆ సంస్థకు చెందిన విమానంలో ప్రయాణించనని, దానికంటే ఎడ్లబండి నయం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదిత్య కొందవార్‌ అనే నెటిజన్ ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు పెట్టారు. ఆయన బెంగళూరు నుంచి పుణెకు వెళ్లడానికి ఆ విమానం ఎక్కారు.

‘‘నాకు గొప్ప గుణపాఠం చెప్పినందుకు ఎయిరిండియా(Air India)కు థ్యాంక్యూ. ఇంకెప్పుడు మీ సంస్థకు చెందిన విమానంలో ప్రయాణించను. అవసరమైతే రెట్టింపు చెల్లించి, సమయానికి వచ్చే విమానాల్లో వెళ్తాను. చివరకు ఎడ్లబండి అయినా ఎక్కుతాను. జూన్ 24 రాత్రి 9.50 గంటలకు టేకాఫ్ కావాల్సిన విమానం అర్ధరాత్రి 12.20 గంటలు దాటిన తర్వాత బయల్దేరింది. ఎక్కిన తర్వాత విమానమంతా ఒకటే వాసన. సీట్లు చాలా మురికిగా ఉన్నాయి. వాటి నిండా మరకలే. నాకు టాటా గ్రూప్‌పై అమితమైన గౌరవం ఉంది. అలాగే వారినుంచి ఎప్పుడూ నాణ్యమైన సేవలను ఆశిస్తాను. కానీ నిన్నటి ప్రయాణం మాత్రం భయానకం’’ అని పోస్టులో వెల్లడించారు.

దీనిపై ఎయిరిండియా(Air India) స్పందించింది. ‘‘ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం. మా పరిధిలోలేని కారణాల వల్ల విమానం ఆలస్యమైందని దయచేసి గమనించండి. మీకు ఎదురైన సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం’’ అని తెలిపింది. అలాగే ఎయిరిండియాలో ప్రయాణించొద్దనే నిర్ణయంపై పునరాలోచించుకోవాలని కోరింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని