వీకెండ్‌లో అనవసరంగా తిరిగితే చర్యలే..! 

రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాల్లో ఎవరైనా అనవసరంగా బయట తిరిగితే...

Published : 24 Apr 2021 01:14 IST

తిరువనంతపురం: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాల్లో ఎవరైనా అనవసరంగా బయట తిరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నెల 24, 25 తేదీల్లో కేవలం అత్యవసర సర్వీసులు మాత్రమే పనిచేస్తాయని కొవిడ్‌ ప్రత్యేక పర్యవేక్షణ బృందానికి నేతృత్వం వహిస్తున్న డీఐజీ కె. సంజయ్‌ కుమార్‌ గురుదిన్‌ వెల్లడించారు. ఈ నెల 24న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు సెలవు ప్రకటిస్తూ ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.  ఈ రెండు రోజుల్లో కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. అత్యవసర సర్వీసులు, కార్యకలాపాలకు సంబంధించిన ప్రయాణాలకు ఆయా వ్యక్తులు తమ ఐడీ కార్డులు చూపించాల్సి ఉంటుంది. ఇప్పటికే నిర్ణయించిన పెళ్లిళ్లు జరుపుకోవచ్చని, వేడుకల్లో పాల్గొనేందుకు 12 మందికి మాత్రమే అనుమతిచ్చింది. అలాగే, కొవిడ్‌ నింధనలను కఠినంగా పాటించాలని సూచించింది.

చండీగఢ్‌లో వీకెండ్‌ లాక్‌డౌన్‌ లేదు..
కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో వీకెండ్‌ లాక్‌డౌన్‌ లేదని అధికారులు వెల్లడించారు. కేవలం రాత్రిపూట కర్ఫ్యూ మాత్రమే ఉంటుందని తెలిపారు. రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు నిర్ణీత రోజుల్లో కర్ఫ్యూ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. 

ఉత్తరాఖండ్‌లోనూ ఉచితంగానే టీకా 
కరోనా విజృంభణ వేళ 18 నుంచి 45 ఏళ్ల వరకు అందరికీ ఉచితంగానే టీకా పంపిణీ చేయాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం తీరత్‌సింగ్ రావత్‌ వెల్లడించారు. మే తొలి వారంలో ఈ టీకా పంపిణీ జరుగుతుందని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా ఉచితంగానే వేయనున్నట్టు తెలిపారు. ఆ ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టంచేశారు. 

నిత్యావసరాల పంపిణీపై కంట్రోల్‌ రూమ్‌
దేశంలో అంతర్గత వాణిజ్యం, నిత్యావసరాల ఉత్పత్తులు, పంపిణీని సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది. వస్తువుల సమీకరణలో తలెత్తే సమస్యల పరిష్కారం, సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా పర్యవేక్షించవచ్చని కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌ వెల్లడించారు. నిత్యావసరాలు, అత్యవసరాల తయారీ, రవాణాలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా దీన్ని ఏర్పాటు చేసినట్టు కేంద్ర వాణిజ్యశాఖ తెలిపింది. +91 11 23062383, 23062975 నంబర్లు రేపట్నుంచి ఉదయం 8గంటల నుంచి రాత్రి 10గంటల వరకు పనిచేస్తాయని, dpiit-controlroom@gov.inకు మెయిల్ కూడా చేయవచ్చని తెలిపారు.

రేపట్నుంచి అందుబాటులోకి ధన్వంతరి ఆస్పత్రి.. 
అహ్మదాబాద్‌లోని గుజరాత్‌ యూనివర్సిటీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ధన్వంతరి కొవిడ్ ఆస్పత్రిని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పరిశీలించారు. ఈ ఆస్పత్రి రేపట్నుంచే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రక్షణ, హోంశాఖ చొరవతో ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. దీంట్లో  950 పడకలు, 250 ఐసీయూ పడకలతో ఈ ఆస్పత్రి ప్రారంభం కానుంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని