CBSE: పరీక్షలపై 2 రోజుల్లో నిర్ణయం  

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను నిర్వహించాలా లేదా రద్దు చేయాలా అన్నదానిపై నిర్ణయం తీసుకునేందుకు రెండు రోజుల గడువు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది.

Published : 31 May 2021 13:10 IST

సుప్రీంకు తెలిపిన కేంద్రం.. విచారణ వాయిదా

దిల్లీ: సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను నిర్వహించాలా లేదా రద్దు చేయాలా అన్న అంశంపై నిర్ణయం తీసుకునేందుకు రెండు రోజుల గడువు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పరీక్షలను ఎందుకు రద్దు చేయకూడదని ఈ సందర్భంగా న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది. 

‘‘ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలపై సమగ్ర వివరాలు కావాలని మేం కోరాలనుకోవడం లేదు. కానీ, గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా నిర్ణయం తీసుకుంటే మంచిదని పిటిషనర్‌ భావిస్తున్నారు. అయితే, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. ఒకవేళ గతేడాది విధానాలకు వ్యతిరేకంగా ఉంటే గనుక.. అందుకు స్పష్టమైన కారణాలను వెల్లడించాల్సి ఉంటుంది’’అని కోర్టు కేంద్రానికి సూచించింది. దీనిపై కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్ స్పందిస్తూ.. ‘‘పరీక్షలపై ప్రభుత్వం రెండో రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. అందువల్ల గురువారం వరకు సమయం ఇవ్వాలని కోరుతున్నా. ఆ రోజున తుది నిర్ణయాన్ని వెల్లడిస్తాం’’ అని చెప్పారు. దీంతో ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు జూన్‌ 3వ తేదీకి వాయిదా వేసింది. 

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఇటీవల కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్రాల నుంచి అభిప్రాయాలను సేకరించింది. అన్ని సబ్జెక్టులకు కాకుండా కేవలం ముఖ్యమైన కొన్నింటికే పరీక్షలు పెట్టాలని కేంద్రం భావిస్తోంది. అయితే, ప్రస్తుత వైరస్‌ ఉద్దృతి దృష్ట్యా పరీక్షలను రద్దు చేసి ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. గతేడాది కరోనా కారణంగానే సీబీఎస్‌ 12వ తరగతి పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని