కొత్తరకం కరోనాపై టీకా పనిచేస్తుందా?

కరోనా వైరస్‌ ముప్పు నుంచి ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడుతోంది. వ్యాక్సిన్‌ రాకతో సాధారణ జీవితంపై సర్వత్రా ఆశలు చిగురించాయి. ఈ తరుణంలో వైరస్‌ కొత్త రూపు సంతరించుకుంటోందన్న వార్తలు కలవరపెడుతున్నాయి.......

Published : 21 Dec 2020 10:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ ముప్పు నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడుతోంది. వ్యాక్సిన్‌ రాకతో సాధారణ జీవితంపై సర్వత్రా ఆశలు చిగురించాయి. ఈ తరుణంలో వైరస్‌ కొత్త రూపు సంతరించుకుంటోందన్న వార్తలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే బ్రిటన్‌, దక్షిణాఫ్రికాలో రెండు రకాల కొత్త కరోనా వైరస్‌లను గుర్తించారు. దీంతో ఆయా దేశాల్లో రెండో దశ వ్యాప్తి ప్రారంభమైనట్లు అధికారికంగా ప్రకటించారు. అప్రమత్తమైన బ్రిటన్‌ ప్రభుత్వం కొత్తగా లాక్‌డౌన్‌ విధించింది. క్రిస్మస్‌ వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని సూచించింది. మరోవైపు ఇప్పటికే ఐరోపా దేశాలు బ్రిటన్‌ నుంచి వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు విమాన రాకపోకలపై నిషేధం విధించాయి.

కొత్త రకం వివరాలివే..

కరోనా పుట్టుక నుంచి ఇప్పటి వరకు అనేక రకాలుగా రూపాంతరం చెందినట్లు పరిశోధకులు గుర్తించారు. తాజాగా బ్రిటన్‌లో గుర్తించిన వీయూఐ-202012/01(VUI-202012/01) మాత్రం అందరినీ అప్రమత్తం చేస్తోంది. సాధారణ కరోనా వైరస్‌ కంటే ఇది 70 శాతం వేగంగా వ్యాపిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. లండన్‌లో తాజాగా వెలుగులోకి వస్తున్న కొత్త కేసుల్లో అత్యధికం ఈ రకం సంక్రమణ వల్లేనని గుర్తించారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)కు కూడా తెలియజేశారు. తద్వారా మిగతా దేశాల్ని అప్రమత్తం చేశారు. అయితే, ఇది వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ కొవిడ్‌ తీవ్రతను పెంచుతున్నట్లు.. మరణాల రేటును పెంచుతున్నట్లు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇక దక్షిణాఫ్రికాలో గుర్తించిన 501.వీ2 వైరస్‌ యువకుల్లో వేగంగా వ్యాపిస్తున్నట్లు గుర్తించారు.

రూపాంతరం అంటే..

వైరస్‌ జన్యుక్రమంలో చోటుచేసుకునే మార్పులనే రూపాంతరం చెందడం అంటారు. వైరస్‌ మానవ శరీరంలోకి ప్రవేశించగానే.. తనకు అనువైన కణానికి అతుక్కొని లోపలికి ప్రవేశిస్తుంది. ఈ సమయంలో మన రోగనిరోధక శక్తి దానితో పోరాడి అడ్డుకుంటుంది. ఈ క్రమంలో శరీరంలో తన మనుగడకు అనుకూలంగా వైరస్‌ రూపాంతరం చెందుతుంది. ఇప్పటి వరకు గుర్తించిన వేలాది రూపాంతరాలు అంత ప్రమాదకరమైనవేమీ కాదని తేల్చారు. తాజాగా బ్రిటన్‌, దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త రకాలతో పాటు గతంలో గుర్తించిన 4614జీ కొంత అప్రమత్తతకు గురిచేశాయి. ఇలా పలు దేశాల్లో అనేక వైరస్‌ రకాలను గుర్తించారు. ఒక్క డెన్మార్క్‌లోనే ఏడు రకాల వైరస్‌లను నిర్ధరించారు.

తాజా వ్యాక్సిన్లు కొత్త వాటిపై పనిచేస్తాయా?

ఇప్పటికే అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు కొత్త వైరస్‌లను సమర్థంగా ఎదుర్కొంటాయా అన్నదానిపై చర్చ జరుగుతోంది. అయితే, ఇది వైరస్‌ రూపాంతరంపై ఆధారపడి ఉంటుందని కింగ్స్‌ కాలేజ్‌కు చెందిన ప్రొఫెసర్‌ స్ట్వార్ట్‌ నీల్‌ తెలిపారు. వైరస్‌ కొమ్ము భాగంలో మార్పు వస్తే మానవ కణాల్లోకి చొచ్చుకుపోయే సామర్థ్యం పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. తాజా వ్యాక్సిన్లలో అత్యధికం ఈ కొమ్ము భాగాల పనితీరును దెబ్బతీయడమే లక్ష్యంగా రూపొందించినవని వివరించారు. మరోవైపు ప్రస్తుతం అభివృద్ధి చేసిన టీకాలన్నీ కరోనా వైరస్‌ రూపాంతరాల్ని సమర్థంగా ఎదుర్కొంటాయని కొంతమంది వైద్య నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వైరస్‌లో ముఖ్యంగా కొమ్ము భాగంలోనే మార్పులు వస్తున్నాయని తెలిపారు. కానీ, టీకాలు మాత్రం ఈ కొమ్ములతో పాటు వైరస్‌ ఇతర భాగాల పనితీరునూ దెబ్బతీసేలా రూపొందించారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో టీకాలు ఎలాంటి కరోనా వైరస్‌నైనా సమర్థంగా ఎదుర్కొంటాయని వివరించారు. జర్మనీ ఆరోగ్య మంత్రి సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. కొత్త రకం వైరస్‌నూ వ్యాక్సిన్లు సమర్థంగా ఎదుర్కోగలవని ఐరోపా సమాఖ్యకు చెందిన వైద్య నిపుణులు తెలిపారని వివరించారు.

ఇవీ చదవండి..

48 రోజులు కీలకం  

బ్రిటన్‌లో కొత్త కలవరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని