Sanjay Raut: వైన్‌ అనేది మద్యం కాదు.. శివసేన ఎంపీ కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్రలోని సూపర్‌ మార్కెట్‌లు, వాక్‌-ఇన్‌ స్టోర్‌లలో వైన్‌ విక్రయాలకు అనుమతించాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆమోదించింది. ఈ నిర్ణయంపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వైన్ అనేది మద్యం కాదు. వైన్ విక్రయాలు...

Published : 28 Jan 2022 22:40 IST

ముంబయి: మహారాష్ట్రలోని సూపర్‌ మార్కెట్‌లు, వాక్‌-ఇన్‌ స్టోర్‌లలో వైన్‌ విక్రయాలకు అనుమతించాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆమోదించింది. ఈ నిర్ణయంపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వైన్ అనేది మద్యం కాదు. వైన్ విక్రయాలు పెరిగితే.. రైతులు దాన్నుంచి ప్రయోజనం పొందుతారు. వారి ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నామ’ని వెల్లడించారు. మరోవైపు ఈ విషయమై భాజపా నేతల విమర్శలను ఉద్దేశించి రౌత్‌ మాట్లాడుతూ.. ‘భాజపా కేవలం వ్యతిరేకతను మాత్రమే ప్రదర్శిస్తుంది. కానీ, రైతులకు ఏం చేయదు. ఈ పార్టీ.. పబ్లిక్‌ సెక్టార్‌ను విక్రయించిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నది నిజమేన’ని అన్నారు.

రూ.5 వేల వార్షిక లైసెన్సింగ్‌ రుసుంతో రాష్ట్రవ్యాప్తంగా సూపర్ మార్కెట్‌లు, వాక్-ఇన్ స్టోర్లలో వైన్‌ విక్రయాలకు అనుమతివ్వాలనే ప్రతిపాదనను మహారాష్ట్ర ప్రభుత్వ గురువారం ఆమోదించింది. దేశీయ వైన్‌ ఉత్పత్తిదారుల కోసం మార్కెటింగ్ వ్యవస్థను మరింత విస్తృతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర కేబినెట్‌ వెల్లడించింది. అయితే, ఈ నిర్ణయంపై భాజపా నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వం.. మహారాష్ట్రను ‘మద్య రాష్ట్ర’గా మార్చాలని చూస్తోందని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ విమర్శలు కురిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని