వింగ్‌లూంగ్.. తొంగిచూస్తే కూల్చేస్తాం..!

సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతూ ప్రస్తుతం వెనక్కి తగ్గిన చైనా.. పాకిస్థాన్‌ను మనపై ఎగదోసేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తోంది! దాయాది దేశానికి డ్రోన్లు విక్రయించి తన దుష్ట బుద్ధిని బయటపెట్టుకుంటోంది. భారత్‌ను టార్గెట్‌ చేసేందుకు పాక్‌ను పావుగా వాడుకుంటున్న డ్రాగన్‌......

Published : 27 Dec 2020 01:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతూ ప్రస్తుతం వెనక్కి తగ్గిన చైనా.. పాకిస్థాన్‌ను మనపై ఎగదోసేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తోంది! దాయాది దేశానికి డ్రోన్లు విక్రయించి తన దుష్ట బుద్ధిని బయటపెట్టుకుంటోంది. భారత్‌ను టార్గెట్‌ చేసేందుకు పాక్‌ను పావుగా వాడుకుంటున్న డ్రాగన్‌.. సైనిక అవసరాల కోసం తయారు చేసిన సాయుధ డ్రోన్లను సమకూర్చింది. శత్రువును టార్గెట్‌ చేయగల సత్తా కలిగిన 50 వింగ్‌లూంగ్‌-2 డ్రోన్లను పాకిస్థాన్‌కు విక్రయించింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌, చైనా నుంచి ఎదురవుతున్న అనుభవాల దృష్ట్యా భారత్‌కు అత్యాధునిక ఆయుధ సంపత్తి ఎంతో అవసరం. ఆఫ్రికా, ఆసియాల్లో జరిగిన పలు యుద్ధాలలో వింగ్ లూంగ్ II విజయవంతం కావడాన్ని చైనా గుర్తుచేస్తుండగా.. భారత సైనిక అధికారులు మాత్రం సాయుధ డ్రోన్లు అనియంత్రిత గగతనతలంలో లేదా గగనతల ఆధిపత్యం ఉన్న చోట మాత్రమే ఉత్తమంగా పనిచేయగలవని పేర్కొంటున్నారు. 

మన వద్ద ఇవి చెల్లవు..!

ఆప్ఘనిస్థాన్‌, ఇరాక్‌లలో తిరుగుబాటుదారులు, ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు అమెరికా ప్రధానంగా డ్రోన్లనే ప్రయోగించిందని అధికారులు చెబుతున్నారు. గగనతలంలో అమెరికా ఆధిపత్యం కలిగి ఉండటమే కారణం. ఇలాంటివి భారత్‌తో పాకిస్థాన్‌, చైనా సరిహద్దుల వద్ద సాధ్యం కాదంటున్నారు వైమానికదళ అధికారులు. జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ, లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద గగనతలాన్ని రాడార్లు చాలా నిశితంగా పరిశీలిస్తాయని, వాటిని ఎదుర్కొంటాయని తెలిపారు. సాయుధ డ్రోన్లు గీత దాటితే సులువుగా కూల్చివేయవచ్చని పలువురు భారత మాజీ ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు. చైనా నుంచి పాకిస్థాన్‌ అత్యాధునిక సాయుధ డ్రోన్లను కొనుగోలు చేయడం..  భారత్‌ సాయుధ డ్రోన్లు, యాంటీ డ్రోన్‌ వ్యవస్థను సిద్ధంచేసుకొని మరింత బలోపేతం కావాల్సిన అవసరాన్ని ప్రధానంగా నొక్కిచెబుతోంది. మానవరహిత వైమానిక వాహనాలు, నియంత్రణ రేఖ వద్ద లేదా, వాస్తవాధీన రేఖ దాటకుండా గగనతలం నుంచి భూమిపైకి ఆయుధాలను ప్రయోగించేందుకు దోహదపడతాయి. వీటిగురించి చైనా, పాక్‌లు ఎంత ప్రచారంచేసినా వాటిని సులభంగా కూల్చేసే అవకాశముంది.

ఆ  అవసరాన్ని గుర్తించిన భారత్‌

యుద్ధతంత్రంలో అత్యాధునిక ఆయుధ సంపత్తి కలిగిన దేశాలే శత్రుదేశాల ముందు నిలవగలుగుతున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణే ఇటీవల ఆర్మేనియాపై అజర్‌బైజాన్ పైచేయి సాధించడం. యుద్ధరంగంలోకి ఆర్మేనియా సంప్రదాయ ఆయుధాలతో దిగితే.. అజర్‌బైజాన్ మాత్రం డ్రోన్లను ప్రయోగించి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచే బరిలో నిలిచి విజయం సాధించింది.  చైనా, టర్కీ సాయుధ డ్రోన్లే లిబియా, సిరియా, అజర్‌బైజాన్‌ యుద్ధాల్లో కీలక పాత్ర పోషించాయి. శత్రుదేశాల నుంచి రక్షణలో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో మన సైన్యానికి సమర్థత కలిగిన ఆయుధ వ్యవస్థలు ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తించిన భారత్‌.. అమెరికా నుంచి రెండు యూఎస్‌ ప్రిడేటర్లను  లీజుకు తీసుకుంది. అలాగే, ఇజ్రాయిల్‌ ఆయుధీకరణ చేయూతలో భాగంగా హెరొన్‌ డ్రోన్‌ అప్‌గ్రేడ్‌కు ఇంకా కొంత సమయం పట్టనుంది. దేశ గగనతలంలోకి ప్రవేశించే క్షిపణులు, శత్రు విమానాలను కనుగొని నాశనం చేసే వ్యవస్థ కోసం టెండర్లు పిలిచింది. అలాగే, రష్యన్‌ ఎస్‌ 400 వ్యవస్థ వచ్చే ఏడాది అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ రంగ డిఫెన్స్‌ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ యాంటీ డ్రోన్‌ రాడార్‌ ఆధారిత వ్యవస్థను తీసుకొచ్చినప్పటికీ ఇది ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. 

అసలేమిటీ వింగ్‌లూంగ్‌ -2 డ్రోన్‌!
వింగ్‌లూంగ్‌-2ను చెంగ్డూ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇండస్ట్రీ గ్రూప్‌ (సీఏఐజీ) అత్యాధునిక సాంకేతితతో రూపొందించింది. ఇది మానవరహితం.  రిమోట్‌ కంట్రోల్‌ లేదా అటానమస్‌ ఫ్లైట్‌ సామర్థ్యం కలిగిన వైమానిక వాహనం. గగనతలంలో నిఘా వేయడంతో పాటు టార్గెట్‌ను కచ్చితంగా ఛేదించగలిగే సత్తా దీని సొంతం. పాకిస్థాన్‌ ఏరోనాటికల్‌ కాంప్లెక్స్‌, చెంగ్డూ ఎయిర్‌క్రాఫ్ట్‌ కార్పొరేషన్ సంయుక్తంగా 48 వింగ్‌లూంగ్‌ -2 యూఏవీలను తయారు చేస్తున్నట్టు 2018లోనే ప్రకటించాయి. 

దీని ప్రత్యేకతలు
మానవ రహితం. పొడవు 11 మీటర్లు . వింగ్‌ స్పాన్‌ 20.5 మీటర్లు, ఎత్తు 4.1 మీటర్లు, టేకాఫ్‌ వెయిట్‌ (గరిష్ఠంగా) 4200 కేజీలు.

సామర్థ్యం
గంటకు 370 కి.మీలు దూసుకెళ్లగలదు. 
ఎండ్యురెన్స్‌ 32గంటలు
సర్వీస్‌ సీలింగ్‌ 9,900 మీటర్లు

ఆయుధాలు ఏముంటాయి? 
బాంబులు: ఎఫ్‌టీ 10, ఎఫ్‌టీ 9, ఎఫ్‌టీ 7, జీబీ 7, జీబీ 4;
క్షిపణులు: బీఆర్‌ఎం1, ఏకేడీ 10, బీఏ 7

జీపీఎస్ సమాచార వ్యవస్థ ఉంటుంది. ఎలక్ట్రో ఆప్టికల్‌ పాడ్‌లు, ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాలు, సెన్సార్లుతో పాటు ఉపగ్రహాలతో అనుసంధానం ఉంటుంది. 

ఏయే దేశాల వద్ద ఉన్నాయి?
బంగ్లాదేశ్‌, చైనా, సౌదీ అరేబియా, పాకిస్థాన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఈజిప్ట్, నైజీరియా

ఇవీ చదవండి..

కొవిడ్‌ దెబ్బ.. రెక్కలు విరిగిన విమానాలు

ఈ రిటైర్డ్ ఉద్యోగి.. ఇప్పుడయ్యాడు మెడిసిన్‌ విద్యార్థి! 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని