Winter session: పార్లమెంటు సమావేశాలు.. అలా ప్రారంభమై.. ఇలా వాయిదా

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లో కార్యకలాపాలు ఆరంభమయ్యాయి....

Updated : 29 Nov 2021 11:30 IST

దిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కార్యకలాపాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. వివిధ అంశాలపై చర్చ చేపట్టాలంటూ లోక్‌సభలో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. నినాదాలు చేశారు. దీంతో సభాపతి సభను మధ్నాహ్నానికి వాయిదా వేశారు. మరోవైపు సిట్టింగ్‌ ఎంపీ ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ మృతికి సంతాపంగా రాజ్యసభను ఛైర్మన్‌ గంటపాటు వాయిదా వేశారు. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), పెగాసస్‌, చైనా చొరబాట్లు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, చమురు ధరల పెరుగుదల వంటి అంశాలు సమావేశాలను కుదిపేసే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు వీటిని లేవనెత్తి తమ వ్యూహాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది.

పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రధాని మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశాలు ఫలవంతంగా సాగాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. ప్రభుత్వం అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉందన్నారు. అర్థవంతమైన చర్చల ద్వారా పార్లమెంటు హుందాతనాన్ని నిలబెట్టాలని కోరారు. అలాగే కరోనా కొత్త వేరియంట్‌ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం ప్రధాని కేబినెట్‌ మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోంమంత్రి అమిత్‌ షా, వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, వాణిజ్యమంత్రి పీయూష్‌ గోయల్‌, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి పాల్గొన్నారు.

మరోవైపు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో ఆ పార్టీ సభ్యులు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. కొత్త సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దుకు ఉద్దేశించిన బిల్లు.. ఈరోజే లోక్‌సభకు రానున్నట్లు సమాచారం. సోమవారం తప్పనిసరిగా పార్లమెంటుకు హాజరుకావాలంటూ అధికార భాజపా, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ తమ ఎంపీలకు విప్‌ జారీచేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని