Corona virus: ఊపిరి పీల్చుకుంటున్న మహారాష్ట్ర.. అతి తక్కువ కేసులు నమోదు

కరోనా మహమ్మారి నుంచి మహారాష్ట్ర క్రమంగా బయటపడుతోంది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 899 కొత్త కేసులు నమోదయ్యాయి......

Published : 25 Oct 2021 23:53 IST

ముంబయి: కరోనా మహమ్మారి నుంచి మహారాష్ట్ర క్రమంగా బయటపడుతోంది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 899 కొత్త కేసులు నమోదయ్యాయి. గతేడాది మార్చి తర్వాత అతి తక్కువ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. 14 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 12 జిల్లాల్లో కేసులు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యాయి. ముంబయి, ఠాణె, పుణె, రత్నగిరి జిల్లాల్లోనే 12 మరణాలు వెలుగుచూశాయి. దీంతో మరణాల రేటు 2.12 శాతానికి పడిపోయింది. సోమవారం మొత్తం 1,586 మంది డిశ్ఛార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 97.47 శాతంగా ఉంది. కాగా మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 66,02,961కు చేరుకుంది. 1.40 లక్షల మంది మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

హిమాచల్‌లో 556 మంది విద్యార్థులకు పాజిటివ్‌

పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు తగ్గుతుండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒక్క నెలలోనే 556 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది. సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 25 వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. హామిర్‌పుర్‌ జిల్లాలో అత్యధికంగా 196 కేసులు, కాంగ్రాలో 173, ఉనాలో 104 మంది విద్యార్థులు వైరస్‌ బారిన పడ్డారు. అయితే ఈ 556 మందిలో ఇప్పటివరకు 250 మంది కోలుకోగా.. హామిర్‌పుర్‌కు చెందిన 13 ఏళ్ల విద్యార్థిని మృతిచెందింది. మిగతా 305 మంది చికిత్స పొందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని